ఆ ‘ముచ్చట’ కోసం చంద్రబాబు అత్యుత్సాహం.!

'మా పార్టీ నేతల్ని అరెస్ట్‌ చేయడం.. మా కార్యకర్తలపై దాడులు చేయడంకాదు.. మీకు చేతనైతే ముందు నా మీద కేసులు పెట్టండి..' అంటూ ప్రభుత్వానికి సవాల్‌ విసిరేశారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత…

'మా పార్టీ నేతల్ని అరెస్ట్‌ చేయడం.. మా కార్యకర్తలపై దాడులు చేయడంకాదు.. మీకు చేతనైతే ముందు నా మీద కేసులు పెట్టండి..' అంటూ ప్రభుత్వానికి సవాల్‌ విసిరేశారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. నిజానికి, చంద్రబాబు మరీ అంత తొందరపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కోసం ఆల్రెడీ చాలా కేసులు ఎదురుచూస్తున్నాయి. ఎన్నో ఏళ్ళుగా 'స్టే'ల మీద ఆధారపడి రాజకీయాల్లో నెట్టుకొచ్చేసిన చంద్రబాబు, అతి త్వరలో అరెస్టవబోతున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.

'రెండేళ్ళలో చంద్రబాబు రాజకీయం ఖతం కాబోతోంది.. ఆయన జైలుకు వెళ్ళబోతున్నారు..' అంటూ బీజేపీ నేతలు ఇప్పటికే హింట్‌ ఇచ్చేశారు. ఆ సంగతేమోగానీ, చంద్రబాబు మాత్రం 'అరెస్ట్‌ కోసం' తెగ సంబరపడిపోతున్నట్లే కన్పిస్తోంది. రాజకీయాల్లో సింపతీ కొట్టేయాలనే వ్యూహంతోనే టీడీపీ అధినేత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నది నిర్వివాదాంశం. ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు ఈ తరహాలో నానాయాగీ చేశారుగానీ.. అప్పట్లో ఆయన ముచ్చట తీరలేదు.

ఇదిలావుంటే, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కావొచ్చు, రాజధానికి సంబంధించి కావొచ్చు.. చంద్రబాబు హయాంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపిస్తోన్న ప్రస్తుత అధికారపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అందుకు తగ్గ పక్కా ఆధారాల్ని సేకరించే పనిలో బిజీగా వుంది. ఆ విషయాలపై ఎప్పటికప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా ఆరా తీస్తున్నారు. అతిత్వరలో చంద్రబాబుపై ముప్పేటదాడి తప్పకపోవచ్చన్న సంకేతాలు అటు కేంద్రం నుంచీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తుండడం గమనార్హం.

అయితే, ముందుగా చినబాబు నారాలోకేష్‌ చిక్కుకుంటారనీ.. ఆ తర్వాతే వ్యవహారం పెదబాబు చంద్రబాబుదాకా వెళుతుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. రాజకీయాల్లో ఆధిపత్య పోరు సర్వసాధారణం. కిందిస్థాయి కార్యకర్తల్లో ఇది అస్సలేమాత్రం కంట్రోల్‌లో వుండదు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయనప్పుడు.. ఆ తరహా ఆధిపత్య పోరు, గ్రామ స్థాయిలో వ్యక్తిగత విభేదాల కారణంగా దాడులు జరుగుతుంటాయి.

వాటికి రాజకీయ రంగు పులిమేసి.. 'చైతనైతే నన్ను అరెస్ట్‌ చేయండి..' అని డిమాండ్‌ చేయడం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వున్న చంద్రబాబుకి తగునా.? ఆ మాత్రం విజ్ఞతే వుంటే.. ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.?  

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు