ఇప్పటివరకూ ఎవ్వరి మాట లెక్కచేయని సీతయ్యగా పాలన సాగించారు కేసీఆర్. కానీ ఇప్పుడా వ్యవహారశైలి నుంచి మెల్లమెల్లగా బయటకొస్తున్నట్టు కనిపిస్తోంది. నేలవిడిచి సాముచేస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు లోక్ సభ ఎన్నికల నాటికి తారుమారైపోతాయని ఆయనకి పూర్తిగా అర్థమైంది. ప్రతిపక్షంలేని తెలంగాణ అటుంచి, అధికార పక్షం కిందకే నీళ్లొచ్చే రోజులు దగ్గర్లో ఉన్నాయని కేసీఆర్ కి క్లారిటీ వచ్చేసింది. అందుకే ఆయన దూకుడు తగ్గించేశారు. దీనికి ఉదాహరణే కేబినెట్ విస్తరణ.
కొడుకు భవిష్యత్ కోసం మేనల్లుడు హరీష్ రావుని కావాలనే పక్కనపెట్టిన కేసీఆర్, ఇప్పుడు పనిగట్టుకుని ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మహిళల విషయంలో ఇన్నాళ్లూ విమర్శలను ఖాతరు చేయని కేసీఆర్, ఏకంగా ఇద్దరికి అవకాశమిచ్చారు. ఇక మూడోది ఈటల వ్యవహారం. కేసీఆర్ ముందు ఎంత పెద్దోళ్లయినా తలెగరేస్తే తోక కట్ చేస్తారు. ఈటలకు పోర్ట్ ఫోలియో తీసేయడం పెద్ద పనేంకాదు, ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కి కూడా బాగా కోపం తెప్పించాయి కూడా.
అలాంటి మాటలన్న ఈటలకు పదవి ఊడుతుందనే అందరూ అంచనా వేశారు. కానీ కేసీఆర్ తెలివైన స్టెప్ వేశారు, పార్టీలో సునామీకి తావివ్వలేదు. మొత్తమ్మీద కేసీఆర్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో పరాభవం, అందులోనూ కూతురు కవిత ఎంపీగా ఓడిపోవడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. అప్పట్నుంచి, ఇప్పటివరకు కేసీఆర్ నిర్ణయాలన్నీ చాలా తెలివిగా తీసుకుంటున్నారు. తాజా మంత్రివర్గ విస్తరణతో కేసీఆర్ లో మార్పు స్పష్టమైంది. మరీ ముఖ్యంగా హరీష్ రావు మంత్రివర్గంలోకి రావడంతో, ఇన్నాళ్లు ఆయనపై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.