బిహార్ లో సామాన్య ప్రజలు రాత్రికిరాత్రి కోటీశ్వరులు అవుతున్నారు. వద్దంటే కోట్లలో డబ్బు వచ్చి పడుతోంది. రాష్ట్రంలో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మరో రైతు రాత్రికి రాత్రికి కోటీశ్వరుడు అయ్యాడు. అతడి ఖాతాలో అమాంతం 52 కోట్ల రూపాయల డబ్బు వచ్చి చేరింది.
ముజఫరాబాద్ జిల్లా కతిహార్ లో రామ్ బహదూర్ షా అనే వృద్ధ రైతు తన పెన్షన్ ఎకౌంట్ కు ఆధార్ కార్డ్, వేలిముద్ర ఇవ్వడానికి బ్యాంక్ కు వెళ్లాడు. ఎలాగూ వెళ్లాడు కాబట్టి ఎకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం అనుకున్నాడు. పక్కనే ఉన్న కస్టమర్ సర్వీస్ పాయింట్ కు వెళ్లాడు. అతడి ఎకౌంట్ లో 52 కోట్ల రూపాయల మొత్తం ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు.
విషయం తెలిసిన వెంటనే బ్యాంక్ సిబ్బంది జాగ్రత్తపడ్డారు. బహదూర్ షా ఎకౌంట్ ను ఫ్రీజ్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. బహదూర్ షా మాత్రం తను కష్టాల్లో ఉన్నానని, అందులో కొంత డబ్బు తనకు ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని బ్యాంక్ సిబ్బందిని వేడుకున్నాడు.
బిహీర్ లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. మొన్నటికిమొన్న ఇద్దరు స్కూల్ విద్యార్థుల ఖాతాలో కోట్ల రూపాయల డబ్బు పడింది. ఒక కుర్రాడి ఎకౌండ్ లో 900 కోట్లు, మరో కుర్రాడి ఎకౌంట్ లో 60 కోట్ల రూపాయల డబ్బు జమ అయింది. అంతకంటే ముందు బిహార్ కే చెందిన ఓ ప్రైవేట్ ట్యూటర్ ఖాతాలో 5 లక్షల 50వేల రూపాయలు పడ్డాయి. ఆ డబ్బును వెనక్కి ఇచ్చేందుకు సదరు ప్రైవేట్ టీచర్ నిరాకరించాడు. లక్షన్నర ఖర్చు చేశాడు కూడా. దీనిపై పోలీస్ కేసు నడుస్తోంది.
ప్రస్తుతం బిహార్ లో అంతా తమ బ్యాంక్ ఎకౌంట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ప్రతి గంటకోసారి బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటున్నారు. తమ బ్యాంక్ కు కేవలం ఎకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి తప్ప, ఇతర పనుల కోసం కస్టమర్లు రావడం లేదని బిహార్ గ్రామీణ బ్యాంక్ ప్రకటించింది.