ఏమీ చేయడం చేతకాని బ్యాచ్ పదే పదే చెప్పేమాట ఒకటుంటుంది. 'నేను లేస్తే మనిషిని కాదు' అని. అయ్యవారు లేవరు, ఆయన మనిషా, కాదా అని చూసే భాగ్యం చుట్టూ ఉన్నవారికి దక్కదు. ఈ రెండూ జరగని పనులే.
ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో కూడా నారా లోకేష్ ఇదే బాపతు అనిపించుకుంటున్నారు. మేం లేస్తే మనుషులం కాదు అంటూ రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ఇంటిపైకి ఎమ్మెల్యేలను పంపించడం సరికాదని అంటున్న లోకేష్.. తమ సంగతేంటో చూపిస్తామంటున్నారు.
వడ్డీతో సహా..
మేం అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ రెచ్చిపోవడం ఇటీవల లోకేష్ కి బాగా అలవాటైపోయింది. తాము అధికారంలోకి వచ్చేది ఎలాగూ లేదని చెప్పడానికే లోకేష్ ఇలా మాట్లాడుతున్నారా అనే అనుమానం కూడా ఉంది.
అధికారుల తప్పులన్నీ లెక్కేసుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చాక అందరి పని పడతామని గతంలో కూడా లోకేష్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు అయ్యన్నపాత్రుడు ఎపిసోడ్ లో మరోసారి అవే స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఒక్కొకరికి వడ్డీతో సహా వడ్డిస్తామని అన్నారు.
చంద్రబాబు పాఠం చెబుతారు రండి రండి..
ప్రతిపక్షం వారిపైకి వాళ్లని, వీళ్లని పంపడం ఎందుకు..? ఓసారి నువ్వే వచ్చి పోకూడదా అంటూ జగన్ కి సలహా ఇచ్చారు లోకేష్. మా పెద్దాయన మీలా క్రూర, నేర స్వభావం ఉన్నవాడు కాదని, జగన్ వస్తే.. టీ, స్నాక్స్ పెట్టి మరీ అభివృద్ధి అంటే ఏంటి, పరిశ్రమలు ఎలా తీసుకు రావాలి, ఉపాధి-ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలనే విషయంపై పాఠాలు చెబుతారని ఎద్దేవా చేశారు. కాదు కూడదు అంటూ బ్లేడ్ బ్యాచ్ ని వెనకేసుకొస్తే.. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామంటూ రెచ్చిపోయారు చినబాబు.
అయ్యన్నపాత్రుడి ఎపిసోడ్ తో టీడీపీ పరువు పూర్తిగా గంగలో కలిసిపోయింది. ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్ మెంట్ లో కూడా టీడీపీ నేతల వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. ఈ దశలో చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిందంటూ అనుకూల మీడియాతో వ్యవహారాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో లోకేష్ వ్యాఖ్యలు మరింత కామెడీ అనిపిస్తున్నాయి.
చంద్రబాబుకి పాఠాలు చెప్పేటంత స్థాయి ఉంటే.. కచ్చితంగా కొత్త రాష్ట్రాన్ని ఐదేళ్లలో అభివృద్ధి బాట పట్టించేవారని, అలా చేయలేదు కాబట్టే ప్రజలు ఆయన్ని తిరస్కరించారని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. వడ్డీతో సహా తిరిగిచ్చే రోజు టీడీపీకి ఎప్పటికీ రాదని అంటున్నారు.