మోడీ ముందు బయటపడ్డ సోము అజ్ఞానం!

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న జాతీయ స్థాయి పార్టీకి ఆయన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. సాధారణంగా రాష్ట్రంలో అత్యంత బలమైన నాయకుల్లో ఒకడై  ఉండాలి. రాష్ట్రం మొత్తం పార్టీకి సారథ్యం వహిస్తున్నాడు అంటే అపారమైన మేథోసంపత్తి,…

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న జాతీయ స్థాయి పార్టీకి ఆయన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. సాధారణంగా రాష్ట్రంలో అత్యంత బలమైన నాయకుల్లో ఒకడై  ఉండాలి. రాష్ట్రం మొత్తం పార్టీకి సారథ్యం వహిస్తున్నాడు అంటే అపారమైన మేథోసంపత్తి, వ్యూహచాతుర్యం, రాష్ట్రంలో పరిణామాలు సంగతుల పట్ల సాధికారత కూడా ఉండాలి! కానీ ఆయనకు అవేమీ లేవు. లేకపోయినప్పటికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా మాత్రం చెలామణీ అవుతూ ఉంటారు. ఆయన మరెవరో కాదు, సోము వీర్రాజు! భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుడైన సోము వీర్రాజు– రాష్ట్ర వ్యవహారాల పట్ల ఎంత జ్ఞానం కలిగి ఉన్నారో మోడీతో సమావేశంలో తేటతెల్లంగా బయటపడిపోయింది!

ఈ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఆయనకు తెలియదు.. ఈ రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో ఆయనకు తెలియదు.. పార్టీకి కొన్ని సూచనలు చేయడానికి జరిగిన సమావేశంలో మోడీ ఆ ప్రశ్నలు అడిగినప్పుడు సోము వీర్రాజు తెల్లమొహం వేశారు, తడబడ్డారు. తప్పులు చెప్పారు. ఈలోగా పక్కనున్న వాళ్లు సరైన గణాంకాలను మోడీకి చెప్పాల్సి వచ్చింది. తమ పార్టీ రాష్ట్ర సారథికి, ఈ రెండు విషయాలు తెలియవని ధ్రువీకరించుకున్న తర్వాత ఆయనను మరో ప్రశ్న అడగడం దండగ అని బహుశా మోడీ నిర్ణయించుకుని ఉంటారు.

బిజెపి కోర్ కమిటీతో శుక్రవారం రాత్రి గంటన్నరకు పైగా సమావేశమైన నరేంద్ర మోడీ అనేక విషయాలు మీద చర్చించారు. కేంద్రం అందిస్తున్న సాయంతోనే రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయనే సంగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని కూడా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ వెనుకబడి ఉన్నదని, బలోపేతం చేయవలసిన బాధ్యత నాయకులు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో సోము వీర్రాజును జిల్లాలు మండలాలు గురించి లెక్క అడిగితే ఆయన చెప్పలేకపోవడం గమనార్హం. 

ఎంతో సునిశితమైన అధ్యయనశీలత ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, తమ రాష్ట్ర సారథి సోము వీర్రాజు లోని ఈ అజ్ఞానాన్ని గుర్తించకుండా ఉంటారా? జిల్లాలు మండలాల లెక్క కూడా తెలియని వ్యక్తి తమ పార్టీకి రాష్ట్ర సారథిగా ఉంటే ఎంత అధోగతి పాలవుతామో ఆయన అంచనా వేయకుండా ఉంటారా? అనే సందేహాలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో రేకెత్తుతున్నాయి. ఇప్పటికే అనేకానేక వైఫల్యాలు సోమువీర్రాజు ఖాతాలో నమోదు అయ్యాయి. ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటాడని ఆరోపణలు చేస్తున్న సొంత పార్టీ నాయకులు బోలెడు మంది ఉన్నారు. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు తన మిడిమిడి జ్ఞానాన్ని కూడా సోము వీర్రాజు ప్రధాని ఎదుట బయట పెట్టుకున్నారు. ఇక తొందరలోనే ఆయన పదవికి ఉద్వాసన ఉంటుందని, రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడు పగ్గాలు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు అనుకుంటే అందులో వింతేముంది.