ఆయన తెలుగు సినిమా రంగంలో ఒక సూపర్ స్టార్.. పవర్ స్టార్ అనే బిరుదుతో చెలామణీ అవుతున్న టాప్ హీరో! స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఎంత సూపర్ హిట్ సినిమాలైనా సాధిస్తుంటాడు! ఇంకో రకంగా చెప్పాలంటే.. అదే స్క్రిప్టు ప్రకారం మాట్లాడే శైలికి ఆయన అలవాటు పడిపోయాడు! సినిమాలలో అయినా అంతే, రాజకీయాలలో అయినా అంతే! స్క్రిప్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ కు నోట్లో మాట పెగలదు. ఆ విషయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత మరోసారి నిరూపణ అయింది.
ప్రధాని షెడ్యూలు ప్రకారం.. పవన్ కళ్యాణ్ తో భేటీకి కేటాయించిన సమయం పది నిమిషాలు మాత్రమే. దానికి ముందు వెనుక ఫార్మాలిటీస్ కోసం కొంత అదనపు సమయం పడుతుంది. కానీ భేటీ తర్వాత సుమారు 40 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ ప్రధానితో సమావేశం అయినట్లుగా పార్టీ తమ ప్రెస్ నోట్ లో వెల్లడించింది. భేటీ నుంచి బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం కనీసం రెండు నిమిషాలు కూడా మీడియాతో మాట్లాడుకుండా, క్లుప్తంగా ముగించి వెళ్ళిపోయారు. అయితే సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. 40 నిమిషాల సేపు సుదీర్ఘంగా ప్రధానితో సమావేశమైన జనసేనాని, ఆ భేటీలోని కీలక అంశాలను ప్రజలకు చేరవేయడానికి కనీసం రెండు నిమిషాలకు మించిన సమాచారం కూడా ఆయన వద్ద లేదా అనే!
పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ లేకపోతే ఒక్క మాట కూడా మాట్లాడలేరు అనేది మరోసారి నిరూపణ అయింది. అవి బహిరంగ సభ వేదికలు అయినా, పార్టీ అంతర్గత సమావేశాలు అయినా చివరికి స్వాతంత్ర దినోత్సవం లాంటి జెండా పండుగ వేడుకలు అయినా సరే, చేతిలో స్క్రిప్ట్ పట్టుకొని పవన్ కళ్యాణ్ తయారవుతారు. మిస్ కాకుండా అందులో పాయింట్లు నోట్ చేసుకొని మరీ వస్తారు. ఎటూ తను ఒక అద్భుతమైన నటుడు గనుక.. మాట్లాడేక్రమంలో అందులోని కంటెంట్ కు తగినట్లుగా హావభావాలను జోడిస్తూ, ఆవేశ కావేషాలను రంగరిస్తూ, జగన్ ప్రస్తావన రాగానే నిప్పులు చెరుగుతూ తన ప్రసంగాన్ని ఆయన రక్తి కట్టిస్తారు.
అయితే ప్రధానితో భేటీ తర్వాత రెండు నిమిషాల పాటు విలేకరులతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ చాలా తడబడ్డారు. మాటలు వెతుక్కున్నారు. సంగతేందో గానీ చాలా క్లుప్తంగా, తమ భేటీ రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేస్తుంది అనే సందేశం చెప్పారు తెలుగు ప్రజల ఐక్యతను మోడీ కోరుకుంటున్నారు అనే సంకేతం ఇచ్చారు. అయితే తడబడుతూనే ఈ రెండు మూడు ముక్కలను వెల్లడించారు. స్క్రిప్ట్ లేకుండా మాట్లాడటం తనకు చేతకాదని మరోసారి నిరూపించుకున్నారు!!
రహస్యాలు, గూడుపుఠాణి వ్యవహారాలు, గోప్యంగా దాచి పెట్టవలసిన అక్రమ లావాదేవీలు ఉంటే తప్ప ప్రధానితో 40 నిమిషాల భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి ప్రాంతీయ పార్టీ నాయకుడికి మీడియాతో చెప్పడానికి ముచ్చట్లే లేకుండా పోతాయా అనేది ప్రజల సందేహం. లేదా, మోడీతో భేటీ పవన్ అనుకున్నట్లుగా కాకుండా తేడాగా జరిగిందా? ఆ షాక్ లో పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్ ను వీలైనంత క్లుప్తంగా ముగించి ‘తర్వాత మాట్లాడదాం’ అంటూ పారిపోయారా? అనే అనుమానాలు కూడా ప్రజలకు కలుగుతున్నాయి.
ప్రధాని మోడీతో ఏం మాట్లాడితే మాత్రం ఏముంది? ఎవరు చూడబోయారు? బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పాలనేది ముందుగానే స్క్రిప్ట్ రాయించుకుని ఉంటే పవన్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉండేవారేమో అని జోకులు వేసుకుంటున్నారు!