ప్రధాని నరేంద్రమోడీతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోడీతో కలిసి ప్రచార సభల్లో పాల్గొన్న తర్వాత.. ఆయనతో వ్యక్తిగతంగా భేటీ కావడం ఇదే. అప్పటి ఎన్నికల ప్రచారానికి ముందు ఓసారి గాంధీనగర్ లో మోడీ సీఎంగా ఉండగా వెళ్లి కలిశారు. ఎన్నికల సభలను మినహాయిస్తే.. వ్యక్తిగత భేటీ ఇది రెండోది అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా చేరిన తర్వాత.. పలుమార్లు ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్, మోడీతో కూడా భేటీ కావడానికి ప్రయత్నించారు గానీ వీలుపళ్లేదు. మొత్తానికి ఇన్నాళ్లకు రెండోసారి కలవడం జరిగింది.
అయితే ఈ భేటీద్వారా పవన్ కల్యాణ్ ఏం సాధించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో ఎలాంటి గుణాత్మక మార్పునకు ఈ భేటీ ద్వారా ఆయన శ్రీకారం దిద్దబోతున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం. అయితే.. భేటీ అనంతరం శుక్రవారం రాత్రి బాగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఎలాంటి వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు. ఏం జరిగిందో, ఏం చర్చించారో, సంకేతాలు ఇవ్వడానికి కూడా ఆయన మొగ్గు చూపలేదు. చాలా క్లుప్తంగా తన మీడియా సమావేశం ముగించి.. ప్రశ్నలన్నింటికీ ‘తర్వాత చెప్తా’ అంటూ వెళ్లిపోయారు.
అయితే, ప్రధానితో భేటీకోసం తాను ప్రయత్నించలేదని, ప్రధాని కార్యాలయం నుంచే ఫోను చేసి కలవాల్సిందిగా చెప్పారని చాటుకోవడానికి పవన్ ఆరాటం స్పష్టంగా కనిపించింది.
‘‘ఈ రోజు ఆయనతో పలు విషయాల పట్ల చర్చించాం. రాష్ట్రంలోని వివిధ అంశాలను, పరిస్థితులను శ్రీ మోదీ గారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిపై నా వద్ద ఉన్న సమాచారాన్ని ఆయనతో పంచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి అన్నదే ప్రధాని ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలన్నదే శ్రీ మోదీ గారు కోరుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో శ్రీ నరేంద్ర మోదీ గారితో ఈ సమావేశం జరిగింది. కచ్చితంగా దీని ఫలితాలు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, భవిష్యత్తు కోసం ఉంటాయి” అని మాత్రమే పవన్ కల్యాణ్ అన్నారు.
ఆయన ఒకటిరెండు నిమిషాల్లో ముగించిన మీడియా సమావేశం ప్రతి మాటను పార్టీ ప్రెస్ నోట్ గా విడుదల చేసింది. అయితే, దానివలన ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయని భయపడ్డారో ఏమోగానీ.. అర్ధరాత్రి సమయంలో పార్టీ మరొక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. పవన్ తో భేటీ సుహృద్భావ వాతావరణంలో, ప్రేమపూర్వకంగా జరిగిందని అందులో వివరించే ప్రయత్నం చేశారు.
పవన్ , ప్రధానితో భేటీ కాబోతున్నారు అనే వార్త వచ్చినప్పటినుంచి.. పచ్చమీడియా నానా హడావుడి చేసింది. ఈ భేటీలో ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారిపోతాయన్నట్లుగా అనేక కథనాలు వండి వార్చింది. కానీ అలాంటివేమీ జరగలేదు. ఒకవేళ ఉన్నాయేమో గానీ.. అందరూ ఆశగా నిరీక్షించారు గానీ పవన్ కల్యాణ్ వెల్లడించలేదు. పవన్ కల్యాణ్ మోడీతో భేటీ కావడం– ఆ ప్రెస్ మీట్ ను గమనిస్తే.. ఒక ఏనుగు సామెత గుర్తుకొస్తోంది.
సామెత మొరటుగా ఉంటుంది గానీ, వివరణ ఇదీ… ఏనుగు ఆకారంలో చాలా పెద్దదిగా ఉంటుంది కదా.. అది అపానవాయువు వదిలితే.. బాంబు పేలినట్టుగా ఉంటుందని ఒకడు అనుకున్నాడట. ఏనుగు వెనుకవైపు చేరి సదరు అపానవాయువు విడుదల కోసం నిరీక్షిస్తున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా వదలడమూ అయింది.. పీల్చడమూ అయింది. అరె ఇంత చిన్నగానా? అని నిరాశపడ్డాడట. వ్యవహారం– ఊహించుకున్నంత బీభత్స రూపంలో లేకపోతే ఈ సామెత వాడుతారు. ఆ సామెతలాగానే ఉంది… ప్రధానితో పవన్ భేటీ!