లోకేష్ పొలిటికల్ కెరీర్ కు వైసీపీ సమాధి?

పాత తరం రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. పాత తరం రాజకీయాల్లో ఒక పార్టీ మరో పార్టీని సిద్ధాంతాలపరంగా, విధానాల పరంగా, నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం ద్వారా ఎదుర్కొనేది. విమర్శలు కూడా…

పాత తరం రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. పాత తరం రాజకీయాల్లో ఒక పార్టీ మరో పార్టీని సిద్ధాంతాలపరంగా, విధానాల పరంగా, నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం ద్వారా ఎదుర్కొనేది. విమర్శలు కూడా చాలా హుందాగా ఉండేవి. రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. ఈ కాలం రాజకీయాలు అందుకు పూర్తిగా భిన్నం. జాతీయ పార్టీల్లోనూ, ప్రాంతీయ పార్టీల్లోనూ చాలామంది అవినీతిపరులు, గూండాలు, రౌడీలు ఉన్నారు. వీరు చేసే రాజకీయాలు కూడా అదేవిధంగా చాలా రఫ్ గా ఉంటున్నాయి. ఇక బూతుల సంగతి చెప్పక్కరలేదు. ముఖ్యంగా చెప్పుకోవలసింది టెక్నాలజీ బాగా పెరిగింది. సోషల్ మీడియా అనేక రూపాల్లో విస్తరించింది. దాదాపు ప్రతీ పార్టీకి సొంత మీడియా ఉంది.

ఈ నేపథ్యంలో ఒక నాయకుడిని పాపులర్ చేయాలన్నా, పనికిరానివాడని ముద్ర వేయాలన్న చాలా …చాలా సులభం. ఏపీలో వైసీపీ ఈ పనే చేయడానికి సిద్ధంగా ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ-టీడీపీ సోషల్ మీడియా ద్వారానే హోరాహోరీగా పోరాడుతున్నాయి. మరి కొత్తగా వైసీపీ ఏం చేయాలనుకుంటున్నది? వైసీపీ తన సోషల్ మీడియాకు పదును పెట్టబోయేది టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ విషయంలో. ఎందుకంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏపీలో లోకేష్ పాదయాత్ర ఫిక్స్ అయింది కదా. లోకేష్ పాదయాత్ర చేయడం వరకు బాగానే ఉంది. 

కానీ పాదయాత్రలో ప్రజలను ఏ విధంగా  ఆకట్టుకుంటాడనేది ప్రశ్న. నడుచుకుంటూ పొతే చాలదు కదా నోరువిప్పి మాట్లాడాలి. ప్రసంగాలతో జనాన్ని మెస్మరైజ్ చేయాలి. కానీ అదే లోకేష్ కు మైనస్ పాయింట్. ఆయన తప్పులు తడకలుగా, అవతవకలుగా మాట్లాడటం చాలాసార్లు విన్నాం. తండ్రి చంద్రబాబు కూడా మంచి ఆరేటర్ కాదుగానీ చెప్పే పాయింట్ కరెక్టుగా చెబుతారు. ఆ లెక్కన చూస్తే జగన్ కూడా మంచి ఆరేటర్ కాదనుకోండి. అది వేరే సంగతి. సరే … లోకేశ్ పాదయాత్ర తేదీ ఫిక్స్ అయింది. కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలుకానుంది. 2023 సంవత్సరం జనవరి 27వ తేదీ నుంచి  పాదయాత్రను మొదలుపెడతారు. పార్టీ పెద్దల నిర్ణయం మేరకు ఆ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని లోకేశ్ ఫిక్స్ అయ్యారు.

అయితే లోకేశ్ పాదయాత్ర పార్టీకి మంచి చేస్తుందని ఎవరూ భావించడం లేదు. ఈ పాదయాత్ర వల్ల లోకేశ్ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కామెంట్లు వస్తున్నాయి. లోకేశ్ పాదయాత్రలో ఇష్టానుసారం మాట్లాడితే పోయేది టీడీపీ పరువే. టీడీపీకి లోకేశ్ ప్లస్ అవుతారో మైనస్ అవుతారో చూడాల్సి ఉంది. లోకేశ్ పాదయాత్ర విషయంలో టీడీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. లోకేశ్ ప్రసంగాల్లో ఏం తప్పులు దొర్లినా భారీ స్థాయిలో ట్రోల్స్ చేయాలని వైసీపీ నేతలు భావిస్తన్నారట. 

లోకేశ్ పొలిటికల్ కెరీర్ కు సమాధి కట్టాలని వాళ్లు అనుకుంటున్నారట. తమ సోషల్ మీడియా విభాగానికి పదును పెడతారట. లోకేశ్ మాత్రం పాదయాత్ర సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. లోకేశ్ ఇప్పటివరకు రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. లోకేశ్ టీడీపీకి మేలు చేద్దామని మాట్లాడిన ప్రతి సందర్భంలో పార్టీకి జరిగిన మంచి కంటే చెడు ఎక్కువనే సంగతి తెలిసిందే. మరి తన పాదయాత్రలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.