ప్రధాన మంత్రి నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత విశాఖ వస్తున్నారు అని కొద్ది రోజుల క్రితం అధికారిక సమాచారం రావడంతోనే ప్రజా సంఘాల నుంచి ఉద్యమకారుల నుంచి మేధావుల నుంచి అనేక విన్నపాలు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నాయి. అందులో ప్రధానమైనది విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని మోడీ విశాఖ వేదిక నుంచి ఘంటాపధంగా చెప్పాలని ఎనిమిది వందల రోజులుగా ఆందోళన చేస్తున్న ఉక్కు కార్మికులు ఇపుడు కుటుంబాలతో సహా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. దాని మీద కూడా మోడీ ఒక ఆశావహమైన మాట చెప్పాలని కోరుతున్నారు. అలాగే విభజన హామీలు చాలా మూలకు చేరిపోయాయి, వాటి సంగతి ఏంటో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న వారు ఉన్నారు.
విభజన వల్ల ఏపీ ఇబ్బందులలో ఉంది. హామీలు ఎన్నో ఉన్నాయి, నిధులు చూస్తే అరకొరగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్ లో కేటాయిస్తున్న నిధులు ఏ మూలకూ సరిపోవడంలేదు, అందువల్ల ప్రత్యేక దృష్టి పెట్టి ఏపీకి నిధులు ఇవ్వాలని అంతా కోరుతున్న పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రా సహా రాయలసీమలోని వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని అడుగుతున్నారు.
ఇవన్నీ విశాఖలో ఒక రోజున్నర పాటు గడపబోతున్న ప్రధాని మోడీ వింటున్నారా. చూస్తున్నారా. వింటే చూస్తే కనుక ఆయన ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో జరిగే సభలో ఏమి చెప్పబోతున్నారు. దాదాపుగా ముప్పావు గంట పాటు మోడీ ప్రసంగం చేయబోతున్నారు. అందులో ఏపీ అభివృద్ధి గురించి ఆయన చెప్పే విషయాలు ఏమిటి ఇచ్చే హామీలు ఏమిటి, చేయబోయే కార్యక్రమాలు ఏమిటి. ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. జవాబు మోడీ స్పీచ్ లో నుంచి తెలుసుకోవాలి.