ట్విట్టర్ లో ఎవరు వీరుడు అని ఆంధ్రలో టక్కున అడిగితే మాత్రం ఎవరైనా లోకేష్ బాబు పేరు చెప్పాల్సిందే. గత 24 గంటల్లో ఆయన అలా అలా ట్వీట్లు సంధిస్తూనే వున్నారు. వంద రోజుల్లో అది చేయలేదు ఇది చేయలేదు అంటూ, అక్కడికేదో వంద రోజలు అంటే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయినట్లు. బాబు గారు మాత్రం నాలుగున్నరేళ్లు చేయకుండా చివరి మూడు నెలల్లో అన్నీ చేసినా ఓకె. కానీ జగన్ మాత్రం ఇచ్చిన హామీలు అన్నీ ఫస్ట్ 100 రోజుల్లోనే చేసేయాలి.
సరే, ఆ సంగతి అలా వుంచితే లోకేష్ బాబు వందరోజుల పాలన గురించి ఇంత కిందా మీదా అయిపోవడం వరకు బాగానే వుంది. మరి కేంద్రంలో కూడా వంద రోజుల పాలన పూర్తి అయింది కదా? మరి దాని మీద ఒక్క ట్వీటు కూడా వేయలేదేలనో?
మోడీ వంద రోజుల పాలన అంటూ భాజపాయేతర పార్టీలు ఏదో ఒక కామెంట్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా కామెంట్ చేసింది. కానీ లోకేష్ మాత్రం నో కామెంట్. జగన్ పాలన కేవలం 100 రోజులు మాత్రమే పూర్తి చేసుకుంది. మోడీ పాలన అయిదేళ్లు ప్లస్ వంద రోజులు పూర్తి చేసుకుంది.
జగన్ అంటే తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, బాబుగారు ఖాళీ చేసి పెట్టిన ఖజానా తీరుతెన్నులు చూసుకోవాలి, ప్రయారిటీలు చూసుకోవాలి. అప్పుడు తన హామీలు ఒక్కోటీ నెరవేర్చుకుంటూ వెళ్లాలి. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల జీతాలు బాగా పెంచారు. ఉద్యోగాలు కల్పించారు.వాటన్నింటికి నిధులు చూసుకోవాలి. కానీ మోడీ వ్యవహారం అలా కాదు.
గత అయిదేళ్లు ఆయనే ప్రధాని. అన్నీ ఆయన చేతిలోనే వుంటాయి. అధికారాలు, నిధులు వుంటాయి. మరి అలాంటి నేపథ్యంలో మోడీ 100 రోజుల పాలన బాగుందా లేదా అన్నది లోకేష్ చెప్పగలగాలి కదా? ఎందుకు చెప్పనట్లో?