నయా గద్దర్, తెలంగాణ ఉద్యమ జ్వాలగా పేరుగాంచిన ప్రజా గాయకుడు సుద్దాల నిస్సార్‌ను కరోనా మహమ్మారి బలి తీసుకొంది. నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించి, కళాకారుడిగా ఎదుగుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడు. తెలంగాణ ముద్దు బిడ్డ అయిన నిస్సార్ గొంతెత్తి ఆలపించే 'పండు వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయె' అనే పాట తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ ఊపు తీసుకొచ్చింది.
ఆర్టీసీ కండక్టర్‌గా జీవనం సాగిస్తూ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతగా కార్మికుల గొంతుకై నిలిచాడు. ఎంప్లాయీస్ యూని యన్ నేతగా, ప్రజా నాట్యమండలి కార్యదర్శిగా సమాజానికి నిస్సార్ అందించిన సేవలు అమూల్యం. కరోనా బారిన పడిన నిస్సార్ చికిత్స కోసం తిరగని ప్రైవేట్ ఆస్పత్రులు లేవని, ఎక్కడా చేర్చుకోలేదని ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మీడియాకు ఆవేదనతో చెప్పుకొచ్చారు.
చిట్ట చివరిగా గాంధీలో చేరితే వెంటిలేటర్ సదుపాయం లేక తెలంగాణ సాంస్కృతిక వారధిగా నిలిచిన నిస్సార్ శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తూ నయాగద్దర్‌గా పేరొందిన నిస్సార్ మరణం ప్రజా ఉద్యమానికి తీరనిలోటన్నారు. అలాగే తెలంగాణ మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ తెలంగాణ ఉద్యమ జ్వాలా గీతం వంటి నిస్సార్ కు కన్నీటి నివాళి అర్పిస్తున్నామన్నారు. ఓ గొప్ప కళాకారుడు వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం.