ఒకటో తేదీ ఉదయాన్నే 6 గంటలకల్లా ఇంటింటికీ తిరిగి వేలిముద్రలు వేయించుకుని పింఛన్ సొమ్ము చేతిలో పెట్టేది ఎవరు? సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేయించేది, లబ్ధిదారుల లిస్ట్ లో పేరు లేకపోతే ఒకటికి పదిసార్లు సచివాలయం చుట్టూ తిరిగేది ఎవరు?
వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు పెట్టే మీటింగ్ లకు ఠంచనుగా వెళ్లేది ఎవరు? కరోనా కష్టకాలంలో ఇల్లిళ్లూ తిరిగి సర్వేలు చేసింది ఎవరు? రేషన్ సరుకులు సక్రమంగా అందేలా కృషిచేసింది ఎవరు? అన్నిటికీ వాలంటీర్లనే సమాధానం వస్తుంది. ఈ క్రెడిట్ అంతా వాలంటీర్లది, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్ ది. అయితే ఇక్కడే ఇంకో చిక్కొచ్చి పడింది.
ఎక్కడో ఒక వాలంటీర్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడట, ఇంకో వాలంటీర్ పింఛన్ సొమ్ము తీసుకుని ఉడాయించాడట, మరో వాలంటీర్ లాక్ డౌన్ టైమ్ లో ఫ్రెండ్స్ కు మందు పార్టీ ఇచ్చాడట. ఇలా తప్పులు దొర్లినప్పుడల్లా వైసీపీని, జగన్ ని తిట్టడం ప్రతిపక్షాలకు ఎంతవరకు సమంజసం. వాలంటీర్లేమైనా వైసీపీ కార్యకర్తలా..? వారి తప్పులన్నిటికీ పార్టీ సమాధానం చెప్పడానికి.
వాలంటీర్లు కూడా మనుషులే, వారు కూడా ఆ గ్రామస్తులే. అలాగని వాలంటీర్లు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవాలని ఎవరూ చెప్పడం లేదు. తప్పు చేసిన వాలంటీర్ని వెంటనే పనిలోంచి తీసిపారేస్తున్నారు కదా, కొత్తవారికి అవకాశమిస్తున్నారు కదా. ఏ వాలంటీర్ తప్పు చేసినా దానికి జగన్ దే తప్పు అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్.
తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మహిళా ఎస్సైని బూతులు తిట్టిన వాలంటీర్ విషయంలో కూడా వెంటనే నింద జగన్ పై తోసేస్తూ పైశాచికానందం పొందుతున్నాయి ప్రతిపక్షాలు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా వైసీపీదే తప్పంతా అని నిందిస్తున్నాయి. ఒక వాలంటీర్ బరితెగించి నడిరోడ్డులో బట్టలిప్పదీస్తే దానికి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది.
లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎవరైనా ఉద్యోగి దొరికిపోతే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తప్పుపడతారా? మరి అక్కడ లేని లాజిక్ ఇక్కడ ఎందుకొస్తుంది. ఆత్మకూరులో అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్ ని శిక్షించాల్సిందే. మద్యం మత్తులో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించిన తీరుకి అతడ్ని దండించాల్సిందే. అదే సమయంలో తప్పుని ప్రభుత్వంపై నెట్టాలని చూడటం మాత్రం మరింత పెద్ద తప్పు.
ఇకనైనా ప్రతిపక్షాలు వాలంటీర్లను వాలంటీర్లుగా చూస్తే మంచిది. వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలు కాదని గుర్తిస్తే మరీ మంచిది.