సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరో ఉచ్చుపన్నిందట! అయితే ఇక్కడ బేసిక్ డౌటేమిటంటే, సోనియా-రాహుల్ లపై భారతీయ జనతా పార్టీ వాళ్లు లెక్కకు మిక్కిలి ఆరోపణలు చేశారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ కూడా ఆ ఆరోపణలు చేసిన వారిలో ఉన్నారు. సూపర్ పవర్ గా, అన్ని ధర్యాప్తు సంస్థలనూ చేతుల్లో పెట్టుకున్నా బీజేపీ వాళ్లు ఇంకా సోనియా, రాహుల్ లపై ఏ విషయాన్నీ నిరూపించలేకపోయారు.
అదే కాదు.. ప్రతిపక్షంగా బీజేపీ వాళ్లు చేసిన ఆరోపణలు, చెప్పుకొచ్చిన విషయాలకూ, అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడిచిపోతున్నా వారు సాధించినదానికీ పొంతన లేదు. నల్లధనం అంశంలో అయితేనేం.. స్విస్ బ్యాంకుల అకౌంట్లు, కాంగ్రెస్ అవినీతి.. ఇవన్నీ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన అంశాలు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ కోట్ల రూపాయల రికవరీ అయ్యిందో, ఎంత నల్లధనాన్ని భారతీయుల అకౌంట్లలోకి వేశారో కమలం పార్టీ వారికే తెలియాలి.
ఆ సంగతలా ఉంటే.. ఎప్పటికప్పుడు కొత్త వ్యవహారాలను లేవనెత్తడం అనే అంశంలో భాగంగా.. ఇప్పుడు చైనా అంశాన్ని బీజేపీ వాడుకుంటూ ఉంది. చైనా నుంచి గాంధీల ట్రస్టుల్లోకి డబ్బు జమ అయ్యిందట, ఈ విషయాన్ని జస్ట్ ఇప్పుడే కనుక్కొన్నారట! బోర్డర్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో.. గాంధీల ట్రస్టుల్లోకి చైనా నుంచి డబ్బు వచ్చిన వైనం గురించి విచారణ చేయిస్తారట!
రాజీవ్ గాంధీ ట్రస్ట్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టులకు చైనా డబ్బులు అందాయని తెలుస్తోందట. వివిధ యాక్ట్స్ కింద ఈ అంశాలపై విచారణ చేయిస్తారట. ఆ ట్రస్టుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకలు సభ్యులుగా ఉన్నారని తెలుస్తోంది.
పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు వస్తే పాక్ తో కాంగ్రెస్ కు సాన్నిహిత్యం, చైనాతో ఇబ్బందులు వస్తే.. చైనాతో బంధాలున్నాయనడం. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి లోపాలను కప్పిపుచ్చుకోవడానికంతా సోనియా, రాహుల్ లు అవకాశంగా మారినట్టుగా ఉన్నారు! అంతకు మించి వీటితో దేశ ప్రజలకు కలుగుతున్న ఉపయోగమెంత?