ఈ ప్రశ్న అడుగుతున్నది మనం కాదు, జర్నలిస్టులు. జర్నలిస్టులు అంటే అన్ని మీడియా సంస్థల్లోని జర్నలిస్టులా? కాదు. కాదు ఒక పత్రికకు చెందిన జర్నలిస్టులు.అదేమైనా దిగ్గజ పత్రికా ? కాదు. హైదరాబాదుకే పరిమితమైన చిన్న పత్రిక. దాని పేరే ఆదాబ్ హైదరాబాద్. అది చిన్న పత్రికే అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తూ ఉంటుంది.
దిగ్గజ పత్రికలు కూడా రాయని యాంగిల్స్ లో కథనాలు రాస్తుంటుంది. కానీ అంతగా ప్రాచుర్యం లేని పత్రిక కాబట్టి ఆ కథనాలు చర్చనీయాంశం కావు. అయితే ఈ మధ్య ప్రచురించిన ఒక వార్త మీడియాలో సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. ప్రభుత్వాన్ని కదిలించింది. పోలీసులు ఆగ్రహించేలా చేసింది. ఫలితంగా ఆదాబ్ హైదరాబాద్ కు చెందిన ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టారు.
ఇంతకూ జర్నలిస్టులను అరెస్టు చేసే పరిస్థితి తీసుకొచ్చిన ఆ వార్త ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించింది. ఈమధ్య ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో కేసీఆర్ కు కరోనా ? అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది కదా. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు దీన్ని అబద్ధపు వార్తగా అంటే ఎలాంటి ఆధారం లేని వార్తగా పరిగణించి జర్నలిస్టులను అరెస్టు చేశారు.
కొంతకాలంగా చాలామంది రాజకీయ ప్రముఖులకు, సినిమా సెలబ్రిటీలకు కరోనా సోకింది. ఫలానా వారికి కరోనా సోకిందని సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తల్లో కొన్ని నిజమయ్యాయి. కొన్ని అబద్ధపు వార్తలున్నాయి. దీంతో అలాంటి వార్తల్లోని వ్యక్తులు తమకు కరోనా సోకలేదని, క్షేమంగా ఉన్నామని వివరణ ఇచ్చారు. కానీ కేసీఆర్ కు కరోనా ? అనే వార్త ప్రచురితం కాగానే అది అబద్ధపు వార్త అంటూ వారిని అరెస్టు చేశారు.
నిజానికి కేసీఆర్ మీద వార్త రాసేముందు జర్నలిస్టులు నిర్ధారించుకున్నారో లేదో తెలియదు. ఎందుకంటే పెద్దవాళ్ళ గురించి పత్రికల్లో వార్తలు రాసేటప్పుడు సదరు సమాచారం సరైనదే అయినప్పటికీ ఎందుకైనా మంచిదని శీర్షికలో ప్రశ్నార్థకం పెడతారు. ఆదాబ్ హైదరాబాదు పత్రికలోనూ కేసీఆర్ కు కరోనా ? అని శీర్షిక పెట్టారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నార్థక శీర్షికలతో వార్తలు వచ్చినపుడు సంబంధిత వ్యక్తులు దాన్ని ఖండించడమో, వివరణ ఇవ్వడమో చేస్తారు. కానీ ఇక్కడ పోలీసులు జర్నలిస్టులను అరెస్టు చేశారు. మరి కేసీఆర్ ఆషామాషీ వ్యక్తి కాదు కదా
ఆదాబ్ పత్రికలో వచ్చిన వార్త చూసి మహమ్మద్ ఇలియాస్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వారు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇది అబద్ధపు వార్త అని పోలీసులు చెబుతున్నారు. కానీ జర్నలిస్టులు మాత్రం తమ మీద బూటకపు కేసు బనాయించారని చెబుతున్నారు. ఈ కేసులో మొదట అన్నంచిన్ని వెంకటేశ్వర రావు అనే సీనియర్ జర్నలిస్టును ఖమ్మంలో అతను ఉదయం వాకింగ్ కు వెళ్ళినప్పుడు అరెస్టు చేసి అటునుంచి అటే హైదరాబాదుకు తీసుకొచ్చారు.
అంటే అతను వాకింగ్ నుంచి ఇంటికి వెళ్ళలేదు. తరువాత సత్యం అనే సబ్ ఎడిటర్ ని (డెస్కులో ఉంటాడు), శివ అనే రిపోర్ట్రర్ ను అరెస్టు చేశారు. అన్నంచిన్ని ఆదాబ్ పత్రికకు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. గతంలో ఈయన ఆదాబ్ పత్రికలోనే సంచలనం కథనాలు రాశాడు. కానీ ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదు.
కేసీఆర్ మీద వార్త రాసింది ఈయన కాదు. శివ అనే రిపోర్టర్ రాశాడు. దీనిపై అతను మాట్లాడుతూ … తాను ఈ వార్తను ఒక తెలుగు న్యూస్ ఛానల్, లీడింగ్ ఇంగ్లిష్ వెబ్సైట్ లలో వచ్చిన కధనాల ఆధారంగా రాశానని చెప్పాడు. మొదట ఒక కథనంలో ప్రగతి భవన్ లో కొందరు సిబ్బందికి కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందని, దాంతో సీఎం మరో చోటుకు వెళ్లిపోయారని వచ్చిందని చెప్పాడు.
రెండో కథనంలో ముఖ్యమంత్రి జ్వరానికి, దగ్గుకు చికిత్స పొందుతున్నారని వచ్చిందని వాటి ఆధారంగానే తాను వార్త రాశానని, కేసీఆర్ గురించి తనకు ఏ అభిప్రాయమూ లేదని చెప్పాడు. సబ్ ఎడిటర్ కు రిపోర్టర్ ఇచ్చిన వార్త పెట్టడం తప్ప దాంతో ఎలాంటి సంబంధం ఉండదు. ముఖ్యమంత్రి ఆర్యోగం గురించి ఆయన ఎక్కడ ఉన్నారు అనేదాన్ని గురించి ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఈ జర్నలిస్టులు అంటున్నారు.
శీర్షికలో ప్రశ్నార్థకం పెట్టి వార్త ఇచ్చామంటే తాము కూడా అనుమానపడుతున్నట్లేనని, నిర్ధారిత వార్త కాదని చెబుతున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే అదే విషయం ప్రభుత్వం స్పష్టం చేయాలని, అబద్ధమైతే ఖండించాలని, అంతేతప్ప ఇలా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉంటున్నదని అడుగుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఎక్కడ ఉన్నారనే సందేహం ప్రజలను వెంటాడుతోంది.
ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటో చెప్పాలని కొందరు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రగతి భవన్ లో కొందరు సిబ్బందికి పాజిటివ్ గా తెలంగాణే కేసీఆర్ గజ్వేల్ లోని తన ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయినట్లు సమాచారం. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన క్షేమంగా ఉన్నారా? అనే ప్రజల ఆందోళనపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.