సాధారణంగా నిర్మాతలే మోజు పడి హీరోల వెంట పడి అడ్వాన్స్ లు ఇస్తారు. ఎప్పుడు సినిమా చేస్తారా? అని హీరోల కరుణా కటాక్షాల కోసం ఎదురుచూస్తూ వడ్డీలు కట్టుకుంటూ వుంటారు. కానీ సినిమా ఇక పాజిబుల్ కాదని తెలిసాక అడ్వాన్స్ లు వెనక్కు ఇవ్వడం కామన్. అది పద్దతి కూడా.
ఓ చిన్న పాటి మెగా హీరో మాత్రం తనకు ఇచ్చిన పాతిక లక్షల అడ్వాన్స్ వెనక్కు ఇవ్వకపోగా, నిర్మాత సినిమా చేయకపోవడం వల్ల తన వేరే సినిమా ఆలస్యమైపోయిందని దబాయిస్తున్నాడట. విషయం ఏమిటంటే ఓ చిన్న నిర్మాత ఓ పెద్ద బ్యానర్ అసోసియేషన్ లో ఓ చిన్న మెగా హీరోతో సినిమా ప్లాన్ చేసారు.
తన సినిమాకు దేవీశ్రీప్రసాద్ కావాలి. ఫలానా సినిమాటోగ్రాఫర్ కావాలి, ఇలా గొంతెమ్మ కోర్కెలు కొరుతుండడంతో, సదరు పెద్ద బ్యానర్ ఇది జరిగే పని కాదని పక్కకు తప్పుకుంది. కానీ అప్పటికే సినిమా మీద పది లక్షలు, హీరోకు పాతిక లక్షలు ఇచ్చేసాడు ఆ చిన్న నిర్మాత. అతగాడు కూడా కొంతకాలం ప్రయత్నించి ఇక సినిమా ఆలోచన విరమించుకున్నాడు.
ఇప్పుడు తన పాతిక లక్షలు వెనక్కు ఇవ్వమని హీరోను కోరుతుంటే …ససేమిరా అంటున్నాడట. పైగా ఆ నిర్మాత సినిమా చేయకపోవడం వల్ల, అప్పటికే లైన్ లో వున్న సినిమా ఆలస్యమైందని అంటున్నాడట. దాంతో పాపం 35 లక్షలు వృధా అయిపోయాయని చిన్న నిర్మాత బాధపడుతున్నారు. అయినా అందరికీ నీతులు చెప్పే మెగాక్యాంప్ కు చెంది, బోలెడు ఆస్తి పాస్తులున్న ఆ చిన్న హీరోకి ఇదేం బుద్దో?