Advertisement

Advertisement


Home > Movies - Reviews

Yashoda Review: మూవీ రివ్యూ: యశోద

Yashoda Review: మూవీ రివ్యూ: యశోద

టైటిల్: యశోద
రేటింగ్: 2.5/5
తారాగణం: సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు
కెమెరా: ఎం సుకుమార్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: మణిశర్మ
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం: హరి-హరీష్ 
విడుదల తేదీ: 11 నవంబర్ 2022

సమంత సినిమా అనగానే కొంత బజ్ రావడం సహజం. ఆమెకున్న స్టార్డం అలాంటిది. పైగా ఈ మధ్య ఆమె తన అనారోగ్యాన్ని ప్రకటించడం వంటి కారణాల వల్ల ప్రస్తుతం ఈమె వార్తల్లో ఉన్న వ్యక్తి. "యశోద" అనే సినిమాతో నేడు ముందుకొచ్చింది. ఇది సరొగసీ నేపథ్యంలో తీసిన సినిమా అని ట్రైలర్ వచ్చినప్పటినుంచి తెలిసిన విషయమే. ఇంతకీ వివరమేంటో చూద్దాం. 

బస్తీలో బతికే ఒక పేద అమ్మాయి యశోద. ఆమెకు అనారోగ్యంతో ఉన్న చెల్లెలు. సరొగసీకి ఒప్పుకుంటే భారీగా డబ్బొస్తుందని, తన చెల్లెలి వైద్యానికి ఆ డబ్బు ఖర్చు చేయొచ్చని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేం టైపులో సరొగసీ గర్భవతులందర్నీ ఒక రహస్య స్థావరంలో ఉంచుతారు. ఆ చోటు చాలా పాష్ గా సకర సౌకర్యాలతో నిండి ఉంటుంది. అంతా బాగుందనుకున్న సమయంలో ఒక పెద్ద ప్రమాదాన్ని పసిగడుతుంది యశోద. అదేమిటనేది తక్కిన కథంతా. 

ప్యారలెల్ గా ఒక మోడల్ కార్ యాక్సిడెంటులో అనుమాస్పద స్థితిలో చనిపోవడం, ఆమె మర్డర్ ఇన్వెస్టిగేషన్ అవీ జరుగుతుంటాయి. పై కథకి, ఈ కథకి ఒక చోట లింకు కలుస్తుంది. 

మొత్తమ్మీద ఇదొక క్రైం థ్రిల్లర్ జానర్ లో తీసిన చిత్రం.  

ఇక అనుభూతి విషయనికొస్తే మీటర్ కథని సాగతీసి కిలోమీటర్ చేసారనిపిస్తుంది. కథనం బాగానే ఉన్నా అది కూడా సాగతీత బారిన పడి ఉక్కిరిబిక్కిరయింది. ఫస్టాఫ్ గ్రిప్పింగ్ గానే నడుస్తూ కొన్ని చోట్ల మాత్రం ఫ్లాట్ అయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సరొగసీ సెంటర్లో సమంతకి ఇన్మేట్స్ తో పరిచయానికి సంబంధించిన లంచ్ టైం సీన్స్ కన్విన్సింగ్ గా లేకుండా విసిగిస్తాయి. 

అలాగే సడన్ గా "జో లాలి..." అంటూ మొదలయ్యే పాట కూడా ప్రేక్షకుల్ని ఒక్క క్షణం కంగారు పెడుతుంది. కథనంలోని మూడ్ కి అడ్డుపడే ఇలాంటి సన్నివేశాలు చెదురుమొదురుగా చాలాచోట్ల కనిపిస్తాయి. 

అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథ పాకానపడి మరింత గ్రిప్ గా మారుతుంటుంది. అయితే బాగుందనుకున్నప్పుడే ఆపి ఉంటే బాగుండేది. నేరస్థులు పోలీసులకి గన్ పాయింటులో ఉన్నకూడా ట్రిగ్గర్ నొక్కకుండా కాలక్షేపం చేసి క్లైమాక్స్ ని సాగతీయడమనేది పాతచింతకాయకి పరాకాష్ట. 

ఈ మైనస్సులు మినహాయిస్తే మిగతా సినిమా అంతా సస్పెన్స్ తో కూడిన క్రైం థ్రిల్లర్ గా అలరిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్లో సమంతకొచ్చిన ఇమేజ్ కి కొనసాగింపుగా అనిపిస్తుంది ఈ చిత్రం. 

ఎవరు హీరోనో, ఎవరు విలనో తెలియకుండా రకరకాల ట్విస్టులతో ఉత్కంఠగానే కథ నడుస్తున్నా మధ్యమధ్యలో పంటి కింద రాళ్లు, బలవంతపు ఎక్స్ట్రా ట్రాకులు అనవసరమనిపిస్తాయి. ముఖ్యంగా సెకండాఫులో సమంత చెల్లిలి పాత్రతో నడిపే ట్రాక్ అవసరంలేని అదనపు బరువులాగ ఉంది. అదేమిటనేది చూస్తే అర్థమవుతుంది. పైగా ఆ పాత్రని ప్రేక్షకులకి ఎమోషనల్ గా కనెక్టే చెయ్యలేదు. అలా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వని పాత్రలకి తెర మీద సీనెక్కువ ఇస్తుంటే భరించడం కష్టం.

ఇన్మేట్స్ లో ఒకమ్మాయి "మాది తోలుబొమ్మలాడించుకునే కుటుంబం" అని ఏదో డయలాగ్ చెప్తుంది. ఏ కాలం నాటి తోలుబొమ్మలాటలు? ఇలా నాన్ సింక్ కొట్టే సంభాషణలు అక్కడక్కడ ఉన్నా ఓవరాల్ గా డయలాగ్స్ బాగున్నాయనే చెప్పాలి.  

అలాగే వరలక్ష్మి- ఉన్ని ముకుందన్ మధ్యన నడిపిన ట్రాక్ కూడా కన్విన్సింగ్ గా లేదు. 

ఇక సాంకేతికంగా సినిమా పలు ఫ్యాకల్టీల్లో మెప్పిస్తుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్లో అక్కడక్కడ కొన్ని మెరుపులు వినిపించాయి. ముఖ్యంగా సెకండ్ హాఫులో వరలక్ష్మికి వాడిన బీజీయం మెప్పిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. ఈ చిత్రానికి దర్శకులు ఇద్దరు. "టూ మెనీ చెఫ్స్ స్పాయిల్ ద షో" మాదిరిగా కాకుండా ఇద్దరూ సామరస్యంతో తీసినట్టే ఉంది. 

నటీనటుల విషయానికి వస్తే సమంత తన స్టైల్లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్నీ కలగలిపి ప్రదర్శించే స్కోపున్న పాత్ర కాబట్టి నటిగా మార్కులు దక్కించుకుంది. 

మేల్ లీడ్ గా ఉన్ని ముకుందన్ సటిల్ పాత్రలో కంటికింపుగా ఉన్నాడు. అయితే అతనిలోని నటనా విశేషం సెకంఢాఫుకి రివీలవుతుంది. 

నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వరలక్ష్మి దాదాపు మెప్పించింది. మురళి శర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు కాప్స్ గా తమ పని తాము బాగానే చేసారు. 

సమంత ఉంది కదా అని "ఓ బేబీ" లాగ ఫ్యామిలీ అందరూ థియేటర్స్ కి వెళ్లి చూడదగ్గ సినిమా అయితే కాదు. పైన చెప్పుకున్నట్టు "ఫ్యామిలీ మ్యాన్"లో సమంతని చూసి ఆమెకి అభిమానులుగా మారిన ఆడియన్స్ కి ఇది నచ్చుతుంది తప్ప రొటీన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని రీచ్ అవడం మాత్రం కష్టమే. క్రైం యాంగిల్, సస్పెన్స్ జానర్ తరహా సినిమాలు ఎంజాయ్ చేయగలిగే వాళ్లకి పలు లూజ్ ఎండ్స్ ఉన్నా కూడా ఈ "యశోద" నచ్చవచ్చు. 

బాటం లైన్: టైటిలంత సాఫ్ట్ కాదు

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా