అయిన దానికి, కానిదానికి కోర్టును ఆశ్రయించడం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పరిపాటైంది. పలుమార్లు న్యాయ వ్యవస్థ మొట్టికాయలు వేసినా, ఆయన మాత్రం తగ్గేదే లే అంటూ జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోని రుషికొండపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు, పిటిషనర్‌ను సున్నితంగా మందలించడం గమనార్హం.
అనుమతులకు మించి రుషికొండలో ఏపీ ప్రభుత్వం తవ్వకాలు చేపట్టిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. రుషికొండలో ఏం జరుగుతున్నదో నివేదిక సమర్పించాలంటే ఇటీవల కేంద్ర పర్యావరణశాఖను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ పనిలో కేంద్ర ప్రభుత్వశాఖలున్నాయి.
కానీ నివేదికలు వచ్చే వరకూ రఘురామకృష్ణంరాజు ఆగలేకపోతున్నారు. చేతిలో పుష్కలంగా డబ్బు ఉండడం వల్ల వచ్చిన అతి తెలివి తేటలు కాబోలు… ఆయన ఇదే విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రుషికొండలో రెండు కిలోమీటర్ల వరకు అక్రమ తవ్వకాలు జరిపారని, అందుకు సంబంధించిన ఫొటోలతో సహా రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం విశేషం. అయితే జోక్యం చేసుకోడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తి చూపలేదు.
ప్రతి ఇంచు జాగాకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఏంటని పిటిషినర్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు నిలదీసింది. ఏదైనా వుంటే హైకోర్టులోనే చూసుకోవాలని కోరింది. రుషికొండపై నిర్మాణాలపై పిటిషనర్ కోరుకున్నట్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల వరకూ వేచి చూడాలని హితవు చెప్పింది. పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం గమనార్హం.