టీడీపీ యువ నేత, ఆ పార్టీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ పాదయాత్రకు డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. 2023, జనవరి 27న పాదయాత్ర ప్రారంభించడానికి పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు తెలిసింది. రిపబ్లిక్ డే మరుసటి రోజు కావడం విశేషం. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి పాదయాత్ర చేయడానికి లోకేశ్ సిద్ధమయ్యారు. ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. ఏడాది పొడవునా అలుపెరగని పాదయాత్ర చేయడానికి లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల నాటికి రెండు మూడు నెలల ముందు పాదయాత్ర ముగించేలా షెడ్యూల్ ఖరారు చేశారని తెలిసింది. రానున్న ఎన్నికల్లో టీడీపీకి చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ దఫా అధికారంలోకి రాకపోతే పార్టీకి గడ్డుకాలమే అని హెచ్చరించక తప్పదు. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్ర చేపట్టాలనుకోవడం కీలక పరిణామంగా చెప్పొచ్చు.
అయితే లోకేశ్ పాదయాత్రతో లాభమా? నష్టమా? అనే సంశయం టీడీపీలో అంతర్గతంగా ఉంది. ఇప్పటికే లోకేశ్ అసమర్థుడనే బలమైన ముద్రను ప్రతిపక్షాలు వేయగలిగాయి. చంద్రబాబుతోనే టీడీపీ ఎండ్ అవుతుందనే ప్రచారం లేకపోలేదు. చంద్రబాబుకు వయసు పైబడుతుండడం, యాక్టీవ్‌గా కొనసాగలేరనే వాతావరణంలో ప్రత్యామ్నాయంగా లోకేశ్‌ను తెరపైకి తేవడం శుభపరిణామం.
అయితే లోకేశ్ తన నాయకత్వ సమర్థతను లోకానికి చాటి చెప్పేందుకు ఇదే సరైన సమయం. లోకేశ్ అడుగులు అధికారం వైపు నడిపిస్తాయా? లేక మరోసారి ప్రతిపక్షంలో కూచోపెడతాయా? అనేది రాజకీయంగా ఆయన ప్రదర్శించే విజ్ఞతపై ఆధారపడింది.