ప్రోటోకాల్ పాటించకపోవడం ప్రతీకార రాజకీయాల్లో భాగం

ప్రస్తుత కాలంలో రాజకీయాలంటే ప్రతీకార రాజకీయాలే. అధికార పార్టీలు ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకునే లేదా వాటిని కలుపుకుపోయే రాజకీయాలు ఏనాడో అంతరించాయి. ప్రతిపక్షాలు అవసరమైనప్పుడు ప్రభుత్వానికి సహకారం అందించే రాజకీయాలు ఎప్పుడో తెరమరుగయ్యాయి. ఒకరినొకరు…

ప్రస్తుత కాలంలో రాజకీయాలంటే ప్రతీకార రాజకీయాలే. అధికార పార్టీలు ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకునే లేదా వాటిని కలుపుకుపోయే రాజకీయాలు ఏనాడో అంతరించాయి. ప్రతిపక్షాలు అవసరమైనప్పుడు ప్రభుత్వానికి సహకారం అందించే రాజకీయాలు ఎప్పుడో తెరమరుగయ్యాయి. ఒకరినొకరు ఎలా అంతమొందిచుకోవాలనే రాజకీయాలే ఇప్పుడు నడుస్తున్నాయి. ఇందులో భాగమే ప్రభుత్వ (అధికారిక) కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం అనేది. ఈ జాడ్యం తెలంగాణలోనూ ఉంది. ఆంధ్రాలోనూ కనబడుతోంది.

ఈ విషయంలో కేసీఆర్ కు, జగన్ కు తేడా ఏమీ లేదు. ఇద్దరివీ ప్రతీకార రాజకీయాలే కదా. తేడా ఏమిటంటే కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అణగదొక్కాలని ట్రై చేస్తారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలనూ పైకి లేవనీయకుండా ప్రయత్నాలు చేస్తారు. జగన్ విషయానికొస్తే కేంద్రం రాష్ట్రానికి అన్యాయమా చేస్తున్నా పల్లెత్తు మాట అన్నారు. దాంతో సఖ్యతగా ఉంటారు. 

రాష్ట్రంలోని ప్రతిపక్షాలమీద మాత్రం ఉగ్రరూపం దాలుస్తారు. మోడీ హైదరాబాదుకు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రోటోకాల్ పాటించరు. ఆయన వచ్చినప్పుడు ఈయన ఎక్కడికో వెళ్ళిపోతారు లేదా ఊళ్ళో ఉండి కూడా ఏదో సాకు చెప్పి హాజరు కారు.

గవర్నర్ ను అసలు పట్టించుకోవడంలేదు. కానీ జగన్ గవర్నర్ తో సఖ్యతగానే ఉన్నారు. ఇక తాజాగా మరోసారి ప్రతిపక్షాలను పూచికపుల్లను తీసి పారేసినట్లు తీసిపారేశారు జగన్. విశాఖలో ప్రధాని మోడీ బహిరంగసభకు టీడీపీ స్ధానిక ఎమ్మెల్యేలకు జగన్ సర్కార్ ఆహ్వానం పంపలేదు. విశాఖ నగరంలో ప్రధాని మోడీ సభకు వాస్తవంగా అయితే స్ధానిక ఎమ్మెల్యేలందరికీ ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వనాలు పంపుతారు. 

కానీ టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం ఎలాంటి ఆహ్వానాలు అందలేదు. చివరికి ప్రధాని సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సైతం ఆహ్వానం అందలేదు. పూర్తి అధికారిక కార్యక్రమం, ప్రోటోకాల్ కార్యక్రమం అయిన ప్రధాని మోడీ సభకు స్ధానిక ప్రజాప్రతినిధుల్ని దూరంగా ఉంచాలన్న ప్రభుత్వ నిర్ణయం విమర్శలకు తావిస్తోంది.