బటర్ ఫ్లయ్ ఎఫెక్ట్ అనేది ఒకటి వుంటుందని దర్శకుడు సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో మన జనాలకు బాగా పరిచయం అయిపోయింది. తీగ లాగితే డొంక కదలడం అంటే ఇదే. ఎక్కడ తీగ లాగాతే ఎక్కడ డొంక కదులుతుందో మన రాజకీయ జనాలకు బాగా తెలుసు. అందులోనూ ప్రధాని మోడీ తాత కు ఇంకా బాగా తెలుసు. అందుకే మూడేళ్లుగా లేనిది ఇప్పుడు అర్జెంట్ గా పవన్ కళ్యాణ్ కు మోడీ అపాయింట్ మెంట్ దొరికేసింది. అయితే ఈ మీటింగ్ ఎఫెక్ట్ తెలుగుదేశం బాబోరి మీద వుంటుందా? వైకాపా జగన్ మీద వుంటుందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రస్తుతం ఆంధ్రలో రాజకీయం బాగా అంటే బాగా వేడెక్కింది. జగన్ అనే పొలిటికల్ జెయింట్ ను కొట్టాలంటే తేదేపా..జనసేన..వామపక్షాలు..ఇంకా ఇంకా అనేకంగా వున్న టుమ్రీ పార్టీలు అన్నీ కలవాల్సి వుంది. లేదూ అంటే కష్టం అని ఈ సోకాల్డ్ పార్టీలు అన్నీ ఎప్పుడో మెంటల్ గా డిసైడ్ అయిపోయాయి. తేదేపా-భాజపా కు పెళ్లి చేయాలన్నది పవన్ కళ్యాణ్ తాపత్రయం. అలా అయితే ఎందుకో తెలియకుండానే తనకు సరిపడని వైఎస్ జగన్ ను గద్దె దింపేయడం సులువు అవుతుంది. కానీ ఇలా జరగాలంటే భాజపా కలిసి రావాలి. ఇలా కలిసి రావడం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
భాజపాతో ఎవరికి వున్న సంబంధాలు వారు వాడుతున్నారు. కానీ భాజపా మనసు కరగడం లేదు. ఇలాంటి టైమ్ లో ఇక లాభం లేదు అని డిసైడ్ అయిన పవన్ ఓ చిన్న పాటి హెచ్చరిక కూడా జారీ చేసారు. అయినా కూడా పెద్దగా తేడా రాలేదు. ఇక భాజపాతో సంబంధం లేకుండా తన హడావుడి తాను చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో మోడీ నుంచి పవన్ కు పిలుపు వచ్చింది. కలుస్తారు. సరే..ఇప్పుడు ఏంటి? ఈ కలయిక ఎఫెక్ట్ ఎవరి మీద వుంటుంది? పవన్ కళ్యాణ్ అయితే జగన్ కు వ్యతిరేకంగానే మాట్లాడతారు. అది పక్కా. మరి ఆ మాటలను మోడీ ఏ మేరకు సీరియస్ గా తీసుకుంటారు? పవన్ సిఫార్సును పరిగణనలోకి తీసుకుని తేదేపాతో విడాకులు వెనుక్కు తీసుకుని మళ్లీ మరోసారి చంద్రబాబును నమ్మి పెళ్లిపీటలు ఎక్కుతారా?
లేదూ అంటే, మోడీనే పవన్ బాబుకు ఎలా చెప్పాలో అలా చెప్పి, తమ దారిలోనే వుంచుకుని ముందుకు నడిపిస్తారా? తెలుగుదేశంతో మనకు దోస్తీ వద్దు..మన ఫైట్ మనదే, ఆ దారిలోనే ముందుకు సాగమని పవన్ కు డైరక్షన్ ఇస్తే కనుక పరిస్థితి ఏమిటి? పైకి ఏం జరిగిందో చెప్పకపోయినా, పవన్ కార్యక్రమాలను బట్టి, పవన్ కు తెలుగుదేశం అనుకుల వర్గం నుంచి వచ్చే మద్దతును బట్టి మోడీ-పవన్ సమావేశంలో ఏం జరిగిందో తెలిసిపోతుంది.
ఒక వేళ మోడీ వైఖరి తేదేపాతో పొత్తుకు ఏమాత్రం అనుకూలంగా లేదు అని క్లారిటీ వచ్చినా పవన్ కు చాలా ఇబ్బందే. అటు తనకు నచ్చిన బాబోరితో ముందుకు సాగలేరు. ఇటు భాజపాను వదులుకోలేరు. అసలు మోడీని కలవకుండా వుంటేనే బెటర్ పవన్ కు. ఎప్పటిలా బాబోరికి అనుకూలంగా తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ పోవచ్చు. నవ్విపోదురు గాక నాకేటి అన్నట్లు, జనానికి తాను ఏం చెస్తున్నానో క్లారిటీగా తెలిసిపోతున్నా, అదేమీ పట్టనట్లు, బాబోరికి అనుకూలంగా, పనికి వచ్చేలా తన పని తాను చేసుకుంటూ పోవచ్చు.
కానీ ఒకసారి మోడీని కలిసి, అక్కడి నుంచి తను ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న రోడ్ మ్యాప్ వచ్చిన తరువాత మరి దాన్ని దాటలేరు. మొత్తానికి మరి కొన్ని గంటల్లో జరిగే మోడీ-పవన్ మీటింగ్ బాబోరికి ప్లస్ అవుతుందా? కాదా అన్నది క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వస్తే, ఇకనైనా పవన్ ను ముందుకు తోసి, అతగాడి కార్యక్రమాల క్రెడిట్ తాము తీసుకుందామనే ప్రయత్నం మాని తమ పని తాను మొదలుపెట్టే అవకాశం వుంటుంది. అదే సమయంలో పనిలో పనిగా తేదేపాతో పాటు పవన్ ను కూడా తమ భుజాల మీద మోస్తున్న సామాజాక మీడియా ఆ పని కాస్త తగ్గిస్తుంది.
మొత్తంగా చూసుకుంటే మోడీ-పవన్ మీటింగ్ బటర్ ఫ్లయ్ ఎఫెక్ట్ ఎలా వుంటుందో తెలిస్తే ఆంధ్ర రాజకీయాలు మహా రంజుగా మారడానికి అవకాశం వుంటుంది.