ప్రజా ప్రతినిధుల కదలికలపై డేగకన్ను
జగన్ ఇంటెలిజన్స్ నిఘాపై కలకలం
చేతివాటానికి అలవాటుపడ్డ కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సెటిల్‌మెంట్లు చేయాలంటే ఇపుడు శిరోభారంగా మారింది. అక్రమాలకు పాల్పడిన నేతల చేతులకు బేడీలు వేయకతప్పదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సదరు అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలయ్యింది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నేతలు, ప్రజాప్రతినిధుల కదలికలపై ఇంటెలిజన్స్ గట్టి నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఏ ముఖ్యమంత్రి ఉపయోగించని రీతిలో ఇపుడు ఇంటెలిజన్స్‌ను జగన్ వాడుకుంటున్నట్టు భోగట్టా!
వివిధ నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధుల రోజూవారీ కార్యకలాపాలపై ఇంటెలిజన్స్ అధికారులు దృష్టిపెట్టారు. ఎప్పటికపుడు ఆయానేతల ఆగడాలను హైకమాండ్‌కు పంపుతున్నట్టు సమాచారం! మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నియమించిన మరో అంతర్గత దర్యాప్తు బృందం నుండి సైతం రోజూవారీ నివేదిక వెళ్తున్నట్టు విశ్వసనీయ సమాచారం! తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల ఓ మంత్రి రహస్యంగా బడా పారిశ్రామికవేత్తకు సంబంధించి ఓ సెటిల్‌మెంట్ చేసేందుకు ముందుకువచ్చినట్టే వచ్చి వెనక్కిమళ్ళిన సంఘటన ఇపుడు పైస్థాయి వర్గాల్లో చర్చనీయాంమయ్యింది.
సదరు మంత్రి ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థకు నేరుగా వెళ్ళి సెటిల్‌మెంట్ చేసి తిరిగి వస్తుండగా హైకమాండ్ నుండి ఫోన్ వచ్చినట్టు తెలిసింది. ఇటువంటి సెటిల్‌మెంట్లు చేస్తే ఇంటికి పంపిస్తానంటూ అధినేత వార్నింగ్ ఇవ్వడంతో సదరు మంత్రికి ముచ్చెమటలు పట్టినట్టు సమాచారం! దీంతో ఆ డీల్ క్యాన్సిల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో మాదిరిగా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు పేకాట క్లబ్బుల నిర్వాహకులందరూ కలసి తమ జోలికి పోలీసులు రాకుండా చూసేందుకు గాను పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు సమాచారం!
ప్రభుత్వంలో బాగా పలుకుబడి వున్న సదరు ఎమ్మెల్యే తొలుత ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. అయితే తీవ్రస్థాయిలో బడాబాబులు నుండి వచ్చిన ఒత్తిడి మేరకు భారీ మొత్తాన్ని అందుకున్నట్టు తెలిసింది. చిత్రంగా ఈ డీల్ ఇలా కుదిరిందో లేదో వెంటనే పై నుండి వచ్చిన ఫోన్‌కు సదరు ఎమ్మెల్యే మైండ్ బ్లాకైనట్టు సమాచారం! పద్ధతి మార్చకోని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వచ్చిన హెచ్చరికకు సదరు ప్రజా ప్రతినిధి డీల్ మొత్తాన్ని వెనక్కిపంపి నా వల్ల కాదంటూ చేతులెత్తేసినట్టు చెప్పుకుంటున్నారు.
ఇదిలావుండగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇపుడు ఏ ఒక్క ఎమ్మెల్యే లేక ఎంపీ సెటిల్‌మెంట్లు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. పరిపాలనపై పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్‌కు సమయం అవసరమైనా, పాలన ప్రారంభంలోనే ప్రజా ప్రతినిధులపై పట్టుబిగించడం ఆయన చిత్తశుద్ధిపై జనంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇంకోవైపు లిక్కర్, ఇసుక, మైనింగ్ మాఫియాలు ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాయి.
జగన్ సర్కార్ వైఖరి మాత్రం గత ప్రభుత్వానికి భిన్నంగా ఉండటం మాఫియాలకు శిరోభారంగా మారింది. గతంలో మైనింగ్, మట్టి, ఇసుక అక్రమ రవాణాలతో కోట్లు గడించిన నేతలు కొందరు వైకాపా, తెలుగుదేశాన్ని ఇప్పటికే వీడారు. తమ దందాను యధా ప్రకారం కొనసాగించేందుకు వైకాపాలో చేరే ప్రయత్నం సదరు నేతలున్నట్టు తెలుస్తోంది. వీరి రాకపై జగన్ ఆసక్తి చూపకపోవడంతో పాటు ఆయా నియోకవర్గాల నేతల నుండి వీరి చేరిక పట్ల నిరసన వ్యక్తమవుతోంది.
ఏ ఎండకాగొడుగు పట్టే ఇటువంటి నేతలను పార్టీలో చేర్చుకోరాదన్న డిమాండ్ ఉంది. జగన్ సైతం ఇటువంటి జంప్ జిలానీల అవసరం ఇపుడేముందని వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం! అలాగే పార్టీలో పనిచేసేవారికే చోటు ఉంటుంది తప్పితే కేవలం అక్రమాలు చేసేందుకు వేదికగా పార్టీని వినియోగించుకునే వారికి కండువా కప్పే ప్రసక్తిలేదని తెగేసి చెబుతున్నట్టు సమాచారం!