cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్‌.... గారాబం చేయడం నేర్చుకోవాలి!

జగన్‌.... గారాబం చేయడం నేర్చుకోవాలి!

నిజంగా ఇదో విద్య. ఇది అందరికీ రాదు. పాపరింగ్‌ లేదా గారాబం అన్నది రాజకీయాల్లో, ముఖ్యంగా అధికారంలో వున్న వారికి రావాల్సిన విధ్య. ఎందకుంటే కాలమాన పరిస్థితులు అలాంటివి. తమ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుని, కిందామీదా ఊగిపోయేవారు రాజకీయాల్లో చాలామంది వుంటారు. అలాంటి వారిని లేదా అలాంటి వారితో డీల్‌ చేయాలంటే ఈ పాంపరింగ్‌ అనే విద్య చాలా అవసరం. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఈ విద్య బాగావచ్చు. వైకాపా అధినేత జగన్‌కు రాదో లేదా కిట్టదో తెలియదు కానీ ఆయన మాత్రం 'పట్టు' విద్యను అస్సలు ప్రదర్శించరు.

గడచిన అయిదేళ్ల సంగతి ముందు చూద్దాం. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన అధిపతిని చంద్రబాబు నాలుగేళ్ల పాటు ఎలా గారం చేసారో తెలిసిందే కదా? మంత్రులు వెళ్లి పిలిచేవారు. స్పెషల్‌ ఫ్లయిట్‌లో వచ్చి వాలేవారు. అప్పుడు కూడా గన్నవరం ఎయిర్‌పోర్టుకు మంత్రులు వెళ్లి స్వాగతం పలికేవారు. కొన్ని కొన్ని నియామకాల్లో తెరవెనుక పవన్‌ బాబు మంత్రాంగం నెరిపేవారు.

భాజపా నేత వెంకయ్య నాయకుడికి అపరిమిత గౌరవం లభించేది. అలాగే సీతారామన్‌ భర్తకు మాంచి పోస్టు వుండేది. ఇక చోటామోటా పార్టీల నాయకులకు కూడా ఆ మాత్రం, ఈ మాత్రం మాట చెల్లుబాటు వుండేది. వారి వారి లెవెళ్లకు తగినట్లు, చిన్న చిన్న పనులు సజావుగా జరిగేవి.

ఇక మీడియా సంగతి చెప్పనక్కరలేదు. ఏటా ప్రకటనల రూపంలో కో¸ట్లకు కోట్లు ఆదాయం కళ్ల చూసే అవకాశం వుండేది. ఆర్థికంగా ఏ లోటూ వుండేది కాదు.

కట్‌ చేస్తే.. జగన్‌ సంగతి చూద్దాం..
జగన్‌ది అంతా అదోటైపు వ్యవహారం. ఎవర్ని ఎంతవరకో అంతవరకే. ఎవ్వరికి చనువు ఇవ్వరు. అస్సలు గారాబం చేయరు. అదే అసలు సిసలు సమస్య. భాజపా నాయకులు ఏమనుకుంటారు. తమతో స్నేహపూరిత ప్రభుత్వం వుంది కాబట్టి, తమకు చిన్నా, చితకా పనులు కావాలనుకుంటారు. అలాగే ఆ పార్టీ పెద్దనేతలు తమకు సులువుగా సీఎంతో కలయిక, ఏదైనా పనులు చక్కబెట్టుకోగల యాక్సెస్‌ వుండాలనుకుంటారు. కానీ అలాంటివి ఏవీ జగన్‌ దగ్గర సాగవు.

ఆ మాటకు వస్తే స్వంత పార్టీ నాయకులకే అంత యాక్సెస్‌ వుండదు. అయితే పైకి చెప్పలేరు. చెప్పుకోలేరు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ఆయనకు అవసరం అయినపుడు కలవాలి కానీ, వీళ్లకు అవసరం అయినపుడు కలవాలంటే అంత వీజీ కాదు. అది జగన్‌ మూడ్‌ను బట్టి వుంటుంది. ఇక ఇంకో సంగతి కూడా వుంది. రాజకీయం అంటే అల్టిమేట్‌గా ఓ సంపాదన మార్గం. ఎవరు కాదన్నా, అవునన్నా, ఇది పచ్చివాస్తవం. ఏ సంపాదన అవసరం లేకుండా పాతికకోట్లు, యాభైకోట్లు పెట్టుబడి పెట్టి గెలిచేయడానికి కిందామీదా అయిపోవడం ఎందుకోసం? కేవలం పేరు కోసమా? పదవి వుంటేనే పనిమనిషి అయినా గౌరవం ఇస్తుందన్నది రాజకీయ నానుడి. ఆ పైన పదవి వుంటేనే పనులు సాధ్యం అవుతాయి.

గతంలో సంగతి ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే జగన్‌ మాత్రం క్లీన్‌ గవర్నమెంట్‌ను నడపాలని చూస్తున్నారు. అవినీతి, అడ్డగోలు సంపాదన సమస్యేలేదు అని డే వన్‌ నుంచి చెబుతూ వస్తున్నారు. కట్టడి చేస్తూ వస్తున్నారు. ఇలాంటి వ్యవహారం ఏ రాజకీయ నాయకుడికి మింగుడు పడుతుంది. పార్టీ జనాలు అయితే తప్పదు కాబట్టి కక్కలేక, మింగలేక కిక్కురుమంటూ వుంటారు. కానీ వేరే పార్టీ వాళ్లకు ఏం పట్టె. అధికారం ఎవరిదైనా చాలాచోట్ల రాజకీయ నాయకులు చెట్టాపట్టాలు వేసుకుని, అధికారంలో వున్నవారు ఎక్కువ, లేనివారు తక్కువ వంతున పంపకాలు వేసుకోవడం చాలాచోట్ల కామన్‌.

కానీ ఇసుక విషయంలో కట్టడి చేసి, బెల్ట్‌ షాపులు మూసేసి, వైన్‌ షాపులు తగ్గించేస్తూ, రికమెండేషన్లు పట్టించుకోకుండా పోతుంటే జగన్‌ పాలన ఏ రాజకీయ నాయకుడికి మాత్రం రుచిస్తుంది. దాంతో ఎవరి సన్నాయి నొక్కలు వారు నొక్కడం ప్రారంభించారు. జగన్‌ ఎక్కువగా అక్కరలేదు, కాస్త కొద్దిగా అయినా ఈ సోకాల్డ్‌ రాజకీయ నాయకులను, వివిధ పార్టీల్లో కాస్త నిత్యం పత్రికల్లో కనిపించేవారికి గారాబం చేయడం ప్రారంభిస్తే, తెలుగుదేశం అనుకూల మీడియా ఫ్రంట్‌ పేజీలో ఆర్భాటంగా వేసుకోవడానికి ఒక్క స్టేట్‌మెంట్‌ అయినా దొరుకుతుందా? అన్నది అనుమానం.

కానీ జగన్‌ దగ్గర అది సాధ్యంకాని పని. వుంటే నాతో ఇలాగేవుండు.. లేదంటే లేదు అన్న టైపు. అందువల్ల భాజపా లోకల్‌ నేతలు కావచ్చు, మరే చోటామోటా పార్టీ నేతలు కావచ్చు రాను రాను కాస్త గట్టిగానే గొంతు విప్పుతుంటారు. అవి మర్నాడు బ్యానర్‌ స్టోరీలు అవుతుంటాయి. అదే బాబు అయితే అలా వినిపించే గొంతులను గారాబమూ చేస్తారు. లేదూ ఇంకా వినకుంటే మిగిలిన పని ఆయన మీడియా చూసుకుంటుంది. ఆ గొంతులు ఫ్రంట్‌ పేజీలో కాదు, లోపల పేజీల్లో సింగిల్‌ కాలమ్‌ కింద కూడా వినిపించని, కనిపించని వ్యవహారంగా మారిపోతాయి.

ఎందుకంటే బాబు మీడియాను కూడా గారాబం చేయగలరు. జగన్‌ వచ్చిన తరువాత మీడియా గారాబం కూడా ఆగిపోయింది. ప్రకటనలు తగ్గిపోయాయి. ఆ మాటకు వస్తే దాదాపు లేనట్లే. ఆర్టీసీని విలీనం వంటి అతి పెద్ద నిర్ణయానికి కూడా ఓ ప్రకటన లేదు. ఇదే నిర్ణయం బాబు తీసుకుని వుంటే పేజీలకు పేజీల ప్రకటనలు వుండి వుండేవి. ఇప్పుడు ఛానెళ్లకు, పత్రికలకు ప్రభుత్వం వైపు నుంచి ఆదాయం అమాంతం పడిపోయింది. మరి మీడియాకు మాత్రం జగన్‌ ఎందుకు ముద్దువస్తాడు.

ఇలా ఆదాయ వనరులు తగ్గిపోతూ, మాట చెల్లుబాటు కాకుండా, రాజకీయం అనేది అస్సలు గిట్టుబాటు వ్యాపారం కాకుండా పోతుంటే, ఎవరికి మాత్రం జగన్‌ నచ్చుతాడు. జనాలకు నచ్చాలి అంటే ఈ రకరకాల బృందాలు కూడా కాస్త గొంతు కలపాలి. లేదూ అంటే ఈ బృందగానాలే అసలు గీతాలు అయిపోతాయి. జనాలకు అసలు వైనం తెలియకుండా పోతుంది. ఈ ఒక్క విషయంలో అంటే ప్రజలకు వాస్తవాలు వివరించే విషయంలో అయినా జగన్‌ జాగ్రత్త తీసుకోవడం అవసరం.
-ఆర్వీ

జగన్ 100 రోజుల పాలనపై 'గ్రేట్ ఆంధ్ర' పేపర్ ప్రత్యేక కథనం