Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేసీఆర్ పక్కలో బల్లెం.. ఈటెల పోస్ట్ అయోమయం

కేసీఆర్ పక్కలో బల్లెం.. ఈటెల పోస్ట్ అయోమయం

మొన్నటివరకు కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు. ఆయన తలలో నాలుక. పరిపాలనలో కేసీఆర్ కు చేదోడువాదోడుగా ఉండేవారు. తిరిగి రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం స్వరం మారింది. అది కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. సీఎం సారుకు సడెన్ గా శత్రువుగా మారిన ఆ మంత్రి ఈటెల రాజేందర్. కొన్ని రోజులుగా టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఇబ్బందిపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న ఈటల, మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఈటెల పదవి ఉంటుందా.. ఊడుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.

కొన్ని రోజుల కిందటి మాట. మంత్రి ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి లేనన్నారు. మరీ ముఖ్యంగా గులాబీ జెండాకు అసలైన ఓనర్లం తామే అన్నారు. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ కోటరీకి అగ్రహం తెప్పించాయి. రసమయి లాంటి నేతలు ఈటెల వ్యాఖ్యల్ని సమర్థించడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా కొంతమంది నేతలు ఈటెలపై పరోక్షంగా ఎదురుదాడికి కూడా దిగారు.

ఇక్కడితో ఆగలేదు ఈటెల. గెలవగలిగే సత్తా ఉన్నోడిని, అమ్ముడుపోకుండా ఉన్నోడిని తన భుజాల మీద పెట్టుకొని మోస్తానన్నారు. తనకు కూడా లోలోపల బాధ ఉందని, అది తన నోటి నుంచి కాకుండా జనం నోటి నుంచి వచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఇవన్నీ కేసీఆర్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఈటల అన్నారనేది ఓ విశ్లేషణ.

ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా క్రమశిక్షణ రాహిత్యం కింద ఈటెల పదవి ఊడిపోవచ్చనే చర్చ జోరుగా ఊపందుకుంది. మరోవైపు తనను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారంపై ఈటెల ఇప్పటికే స్పందించారు. తెలంగాణ గడ్డమీద ఆత్మగౌరవంతో బతికానని, చిల్లరమల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. దీంతో మరింత అగ్గిరాజేసినట్టయింది. ఈటెలపై వేటు తప్పదంటున్నారు చాలామంది.

మరోవైపు ఈటెలతో పాటు మల్లారెడ్డి మెడపై కూడా కత్తి వేలాడుతోంది. ఈ మంత్రికి కూడా ఉద్వాసన తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. మల్లారెడ్డి పనితీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి అంశాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు అందరిదృష్టి ఈటెలపైనే ఉంది. అతడ్ని మంత్రివర్గంలోనే కొనసాగిస్తారా లేక పక్కనపెడతారా అనేది అందర్లో ఆసక్తికరంగా మారింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?