Advertisement

Advertisement


Home > Politics - Gossip

హరీష్ రావు జాతకం తేలే రోజు వచ్చేసింది?

హరీష్ రావు జాతకం తేలే రోజు వచ్చేసింది?

ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పట్నుంచి హరీష్ రావును దూరం పెడుతూ వస్తున్నారు కేసీఆర్. కొడుకు కేటీఆర్ కు ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నారో, హరీష్ ను రాజకీయంగా అంతగా తక్కువ చేయడానికి ప్రయత్నించారు. ఎంతలా అంటే సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు కూడా హరీష్ ను ఆహ్వానించలేదు కేసీఆర్. చివరికి హరీష్ రావు తన నియోజకవర్గంలో ఓల్డేజ్ హోమ్స్, లైబ్రరీల ప్రారంభోత్సవాలకు మాత్రమే పరిమితమయ్యారు.

ఈ క్రమంలో ఒక దశలో హరీష్ రావు, బీజేపీకి దగ్గరవుతున్నారనే ఊహాగానాలు కూడా చెలరేగాయి. అలా పార్టీ పరంగా హరీష్ ను పూర్తిగా దూరంపెట్టిన కేసీఆర్, అతడికి మరోసారి మంత్రి పదవి ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈరోజు తెలంగాణ కేబినెస్ విస్తరణ ఉంది. సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటుచేశారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చేది కూడా ఈరోజే. కొత్త గవర్నర్ సౌందర్ రాజన్ ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ వెంటనే సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

పార్టీపై, కేసీఆర్ పై హరీష్ కు మనసులో కోపం ఉంది. పార్టీ స్థాపించినప్పట్నుంచి కష్టపడి పనిచేసిన తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగానే ఉన్నారు. కాకపోతే తన అసహనాన్ని ఆయన ఎక్కడా వెళ్లగక్కలేదు, పైపెచ్చు తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీతోనే ఉంటానని ప్రకటించడం గమనార్హం. దీనికి కారణం మంత్రివర్గ విస్తరణ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విస్తరణలో హరీష్ కు చోటు దక్కకపోతే ఆయన కచ్చితంగా రెబల్ గా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేవలం కొద్దిమందికి మాత్రమే మంత్రులుగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. ప్రస్తుతం సీఎంతో కలిపి కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. కేబినెట్ లో మరో 6 ఖాళీలు అలానే ఉన్నాయి. ఎప్పటికైనా వాటిని భర్తీచేసి తీరాల్సిందే. ఆ రోజు కోసమే హరీష్ ఇన్నాళ్లూ ఎదురుచూశారు. మరీ ముఖ్యంగా కేటీఆర్ కు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి, ఈసారి అతడికిస్తే తనకు కూడా ఇస్తారనే ఆశాభావం హరీష్ లో కనిపిస్తోంది. అందుకే ఇన్నాళ్లూ ఓపిక పట్టారు. ఇన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం, తెలంగాణ కేబినెట్ లో హరీష్, కేటీఆర్ ఇద్దరికీ పదవులు దక్కే ఛాన్స్ ఉంది. వీళ్లతో పాటు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. నిజానికి కేసీఆర్ చాలా పెద్ద ప్లానింగ్ తో ముందుకెళ్లారు. కుదిరితే ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్నారు. అందుకే కేటీఆర్, హరీష్ కు ఎలాంటి పదవులు ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టారు. కానీ కేంద్రంలో సీన్ మారిపోయింది. బీజేపీకి భారీ మెజారిటీ వచ్చింది. దీంతో అక్కడ చక్రం తిప్పడానికి కేసీఆర్ కు అవకాశం లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా కవిత కూడా ఎంపీగా ఓడిపోవడం కేసీఆర్ ను ఇరకాటంలో పడేసింది. దీంతో మరోసారి మంత్రివర్గ విస్తరణ చేసి కొడుకు, మేనల్లుడికి న్యాయం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సస్పెన్స్ కు తెరపడనుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?