cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై మొదలైన వ్యతిరేక సెగ!

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై మొదలైన వ్యతిరేక సెగ!

పార్టీ అధికారం చేపట్టి మూడునెలలు అవుతున్నా..ఇప్పటి వరకూ కనీసం తన అనుచర వర్గాన్ని కూడా పలకరించని ఎమ్మెల్యేలు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీ అనే హోదాలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు కాకముందు ఈ నేతలు పార్టీ కార్యకర్తలతో చాలా దగ్గరగా ఉండేవారు. చనువుగా ఉండేవారు. అన్నింటికీ తాము ఉన్నామంటూ అప్పుడు భరోసా ఇచ్చారు. ఒక్కసారి ఎన్నికలు అయిపోగానే ఈ నేతల తీరు చాలా మారిపోయింది. ఎంతలా అంటే.. ఎన్నికలకు ముందు తాము ఎంతో ఆప్యాయంగా మాట్లాడించిన వ్యక్తులనే వీళ్లు అస్సలు పట్టించుకోవడం లేదు. సిసలైన రాజకీయ నేతల్లా ప్రవర్తిస్తున్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు. ఎంతలా అంటే.. వీళ్లు ఆఖరికి సొంత క్యాడర్‌ను కూడా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు.

ఇప్పుడే రాజకీయం మొదలుపెట్టిన నేతలే అప్పుడే క్యాడర్‌ను పూర్తిగా పక్కన పెట్టేయడం విస్మయకరంగా మారింది. ఇన్నిరోజులూ తాము ఏ నేతల కోసం అయితే తెగ తిరిగామో ఇప్పుడు వారి గురించినే ఓపెన్‌గా అసంతృప్తిని వ్యక్తంచేస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైన్యం. అందరూకాదు కానీ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కొంతమంది ఎమ్మెల్యేల తీరు మరీ దారుణంగా కనిపిస్తోంది. ఎన్నికలు అయిపోయి మూడునెలలు గడుస్తున్నా ఈ నేతలు ఇంతవరకూ నియోజకవర్గాల మొహం చూడటం లేదు. ప్రభుత్వం ఏర్పడగానే వీళ్లు తమ నియోజకవర్గాలను వదిలి తమ సొంత పనులు మొదలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.

ప్రభుత్వం ఏర్పడగానే తమ పెండింగ్‌ పనులను వీళ్లు చేసుకొంటూ ఉన్నారు. నియోజకవర్గం వైపు వెళితే కార్యకర్తలు తమను పట్టేసుకుంటారనే భయపడుతున్నారో ఏమోకానీ.. కొందరు అటువైపే వెళ్లడంలేదు. వెళ్లినా క్యాడర్‌కు అస్సలు అందుబాటులో ఉండటంలేదు. ఇప్పుడు వారితో అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ నేతలు. ఎన్నికలు అయ్యాకా తాము తమ ఎమ్మెల్యేలను మళ్లీ చూసింది లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులే వాపోతూ ఉన్నారు.

ఏదైనా ఓపెనింగూ గట్రా ఉంది, పేపర్లో పేరు పడుతుంది అంటే.. ఆ కార్యక్రమానికి అలావచ్చి వెళ్తున్నారు. అప్పుడు క్యాడర్‌ కలిసి ఏదైనా విన్నవిస్తే.. ఊరటమాటలు చెప్పి అక్కడ నుంచి ఈ నేతలు ఉడాయిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వీళ్ల మీద కార్యకర్తలు చాలాఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే తమకు ఏదో చేస్తాడనే ఆశలు పెట్టుకున్నారు. అయాచితంగా ఏదో చేయాలని వారు అనడంలేదు. ఏదైనా ఉపాధిమార్గమో, ఉపాధిమార్గాన్ని తామే చూసుకుని పని చేసుకుంటామని అడిగినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు క్యాడర్‌ను పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. మంత్రి పదవుల కోసం చాలామంది నేతలు పోటీపడ్డారు. కొంతమందికి అవకాశం దక్కింది, కొందరికి అవకాశం దక్కలేదు. దక్కనివారు అసంతృప్తికి లోనయ్యారు. తాము ఎమ్మెల్యేగా ఎంతో కష్టపడి నెగ్గుకువస్తే తమకు జగన్‌ అవకాశం ఇవ్వలేదని వారు వాపోయారు. మరి ఎమ్మెల్యే అనే హోదా ఉన్నప్పటికీ, అది కూడా తొలిసారి సాధించుకున్నదే అయినా కొంతమంది నేతలు తమకు మంత్రిపదవి దక్కలేదని బాధపడ్డారే.. వాళ్లకే అలాంటి బాధ ఉన్నప్పుడు వీళ్లవెంట తిరిగిన కార్యకర్తకు తను కోరుకున్న చిన్నదేదో దక్కకపోతే అప్పుడు వాళ్ల పరిస్థితి ఏమిటి? ఈ విషయం ఎమ్మెల్యేలకు తెలియదా?

అందరికీ న్యాయం చేయడం సాధ్యంకాదు, ఎంతమందికి అని కోరికలు నెరవేర్చేది.. అనే వాదనా ఉంటుంది. అయితే వాళ్లందరినీ ఎన్నికల ముందు వాడుకున్న వైనం ఈ నేతలకు గుర్తుండాలి కదా. ఎన్నికలకు ముందువాళ్లు అటు ప్రభుత్వం వైపు నుంచి, ఇటు తాము వ్యక్తిగతంగా బోలెడన్ని హామీలు ఇచ్చారు ఈ నేతలు. వాటిని వందశాతం నెరవేర్చకపోయినా ఎంతోకొంత శాతం అయినా నెరవేర్చాలి కదా. కార్యకర్తలతో మాట్లాడి వాళ్లకు కావాల్సింది ఏమిటో అడిగి తెలుసుకోవడం మాట అటుంచితే.. నియోజకవర్గాల వైపుకే కొందరు రావడం లేదని తెలుస్తోంది. వచ్చినా క్యాడర్‌ను మాత్రం సదరునేతలు పట్టించుకోవడం లేదు.

ఈ పరిణామాలు సహజంగానే క్యాడర్‌లో అసంతృప్తిని కలిగిస్తాయి. అసహనంగా మారతాయి. ఎంతచెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఏ స్థాయి కార్యకర్తకు ఆ స్థాయి అసంతృప్తి మొదలైతే నేతల భవితవ్యం ఏమవుతుందో వారే అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం పై సామాన్య ప్రజల్లో అసంతృప్తి రేగడం సహజమే. అది నెమ్మదినెమ్మదిగా జరుగుతుంది. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తల్లో మాత్రం అత్యంత వేగంగా అసహనం రేగుతూ ఉంది. పార్టీ కోసం ఎంతో కష్టపడిన వాళ్లు కూడా అప్పుడే.. పూర్తిగా నిస్పృహకు లోనవుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఈ పరిస్థితి ప్రస్ఫుటం అవుతూ ఉంది. నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాల్లో కూడా ఇదే తీరే కనిపిస్తూ ఉంది.

గ్రేటర్‌ రాయలసీమ పరిధిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వీప్‌ చేసినంత పనిచేసింది. అలాంటి చోట జగన్‌ మీద కన్నా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత స్టార్ట్‌ కావడం గమనార్హం. మెజారిటీ ఎమ్మెల్యేలు జనం మధ్యకు రావడంలేదు. పార్టీ కార్యకర్తల్లోనే ఈ నేతలపై వ్యతిరేకత మొదలైతే.. సామాన్య ప్రజానీకాన్ని కన్వీన్స్‌ చేసేవాళ్లు ఉండరు. ఎన్నికల ముందంతా ఓడ మల్లన్న  అన్నట్టుగా చూసి, ఎన్నికలు అయిన తర్వాత కార్యకర్తలను, వెంట నిలిచిన వారిని బోడి మల్లన్నల్లా ట్రీట్‌ చేస్తున్న నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తీవ్రమైన నష్టంచేసే అవకాశాలు కూడా ఉంటాయి. రాయలసీమలో ఎన్నికల ముందుంతా బోలెడంత క్రేజ్‌ను పెట్టుకున్న కొంతమంది నేతలు ఇప్పుడు తమ అసలు రూపాలను చూపిస్తున్నారు. వంద రోజుల్లోనే వీరు చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.

ఇలా చుట్టూ ఉన్న వారికి అందుబాటులో లేకుండాపోయి.. తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వారి జాబితాను తయారు చేస్తే టాప్‌ పొజీషన్లో కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. రాప్తాడు ఎమ్మెల్యే  తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే మంత్రి శంకర్‌ నారాయణ, కర్నూలుజిల్లా ఎమ్మెల్యేలు కొందరు, జగన్‌ మేనమామ- కమలాపురం ఎమ్మెల్యే రవీంధ్రనాథ్‌ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వంటి వారి తీరు కార్యకర్తల్లోనే అసంతృప్తిని కలిగిస్తూ ఉంది. అలాగే ఎమ్మెల్యే కమ్‌ ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా, తిరుపతి ఎమ్మెల్యే భూమనల పనితీరు కూడా ఏమంత గొప్పగా లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యతిరేకతను పెంచుకుంటున్న వారిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు కూడా ఉంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల్లోని కొందరిలో కొన్నిరకాల అవలక్షణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందంతా వెంటపెట్టుకున్న వారిని ఇప్పుడు పట్టించుకోనివారు కొందరు. కొన్నిరకాల ప్రజాసంబంధ వ్యవహారాల్లోకి దూరి పేరు చెడగొట్టుకుంటున్నది ఇంకొందరు. పార్టీలో ఇన్నాళ్లూ తమకు సహకారం అందించి, తమతో కలిసి పనిచేసిన నేతలకు కించిత్‌ గౌరవం కూడా ఇవ్వకుండా వారిని పూర్తిగా పక్కన పెట్టేస్తున్న నేతలు ఇంకొందరు.. ఇలా ఏ రకంగా చూసినా వారు తమ రాజకీయ భవితవ్యానికి, అటు పార్టీకి వీలైనంత నష్టమే చేస్తూ ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే బాగా పని చేసుకుపోతున్న ఎమ్మెల్యేలు కూడా కొందరున్నారు. సానుకూల అభిప్రాయాలనూ వాళ్లు కలిగించుకుంటున్నారు. అనునిత్యం ప్రజల మధ్యనే మెలుగుతూ కొందరు తమకు చేతనైన సాయం చేస్తూ ఉన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ జాబితాలో ముందున్నారని చెప్పవచ్చు. 'గుడ్‌ మార్నింగ్‌' అంటూ నియోజకవర్గాన్ని అంతా కలియదిరుగుతున్నారాయన. ప్రజల మధ్యకు అంతలా రావాలంటే ఎమ్మెల్యేలకు చాలా గట్సే ఉండాలి. తెలుగుదేశం అభిమానులు కూడా కేతిరెడ్డి తీరును మెచ్చుకుంటున్న వైనం అగుపించింది.

ఈ తరహాలో ప్రజల మధ్యకు వస్తే.. ఏ ఎమ్మెల్యే మీద అయినా సానుకూల భావన కలుగుతుంది. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త కొత్తగా నెగ్గినవారు  తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు. తమకు తిరుగులేదనే భ్రమలో మునిగిపోతున్నారు. ఇలాంటి వారి గురించి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంత త్వరగా ఫీడ్‌ బ్యాక్‌ తెప్పించుకుంటే అది ఆయన పార్టీకే మేలు చేకూర్చుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
-జీవన్‌రెడ్డి.బి

జగన్ 100 రోజుల పాలనపై 'గ్రేట్ ఆంధ్ర' పేపర్ ప్రత్యేక కథనం