సాహో తేలిపోయింది.. మరి సైరా పరిస్థితేంటి?

బాహుబలి-2.. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే. ఈ మూవీ రికార్డుని బద్దలుకొట్టడమే ప్రతి హీరో లక్ష్యం. అందుకే భారీ బడ్జెట్ లు, పాన్-ఇండియా సినిమాలు. కానీ ఇప్పటివరకు ఇండియా వసూళ్లలో ఈ సినిమా…

బాహుబలి-2.. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే. ఈ మూవీ రికార్డుని బద్దలుకొట్టడమే ప్రతి హీరో లక్ష్యం. అందుకే భారీ బడ్జెట్ లు, పాన్-ఇండియా సినిమాలు. కానీ ఇప్పటివరకు ఇండియా వసూళ్లలో ఈ సినిమా రికార్డుని ఎవ్వరూ బద్దలుకొట్టలేకపోయారు. మొన్నటికిమొన్న 2.O వచ్చింది. వసూళ్లలో బాహుబలి-2 దరిదాపులకు కూడా వెళ్లలేకపోయింది. నిన్ననే చైనాలో రిలీజైంది. అక్కడ ఇది ఎంత పెద్ద హిట్ అయినా వరల్డ్ వైడ్ వసూళ్ల పరంగా బాహుబలి-2ను అధిగమించడం కష్టమే.

ఇక సాహో విషయానికొద్దాం. బాహుబలి-2 రికార్డుల్ని బద్ధలుకొట్టాలంటే అది మళ్లీ ప్రభాస్ తోనే సాధ్యం అన్నారు చాలామంది. ఈ దిశగా సాహో సినిమా చుట్టూ చాలా విశ్లేషణలు నడిచాయి. రిలీజ్ తర్వాత సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో రికార్డులు కష్టమని తేలిపోయింది. తాజాగా వచ్చిన వారం రోజుల వసూళ్లతో బాహుబలి-2తో సాహో పోటీపడలేదనే విషయం స్పష్టమైంది. భవిష్యత్తులో సాహో సినిమాను చైనాలో రిలీజ్ చేసినప్పటికీ అది బాహుబలి-2కు పోటీ కాదని ట్రేడ్ తేల్చేసింది.

2.O, సాహో సినిమాల తర్వాత బాహుబలి-2పై కన్నేసిన చిత్రం సైరా. చిరంజీవి నటించిన ఈ సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. సరిగ్గా మరో 25 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాహుబలి-2ను అధిగమిస్తుందని మెగా ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ మేరకు బెట్టింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. ఫ్యాన్స్ సంగతి పక్కనపెడితే, మెగా కాంపౌండ్ టార్గెట్ కూడా బాహుబలి-2 సినిమానే.

టాలీవుడ్ లో రికార్డులు ఏమైనా ఉంటే అవి మెగా కాంపౌండ్ పేరిట మాత్రమే ఉండాలనేది ఈ హీరోల లక్ష్యం. గతంలో బాలయ్య-చిరంజీవి మధ్య జోరుగా పోటీ నడిచినా.. ఇప్పుడు మెగా హీరోలకు మహేష్ బాబుకు మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తున్నా దానికి కారణం ఇదే. సరిగ్గా ఇదే టైమ్ లో అనుకోని విధంగా వచ్చిన బాహుబలి-2 మొత్తం రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. ఒకప్పుడు మహేష్, చిరంజీవి, బాలయ్య రికార్డులతో సరిపోల్చేవారు. ఇప్పుడా సినిమాలన్నీ పోయాయి. వాటి స్థానంలో బాహుబలి-2 మాత్రమే నిలిచింది. 

ఏ హీరో అయినా తమది నాన్-బాహుబలి రికార్డ్ అని చెప్పుకుంటున్నారే తప్ప, బాహుబలిని క్రాస్ చేసిన రికార్డు సృష్టించలేకపోతున్నారు. ఇది మెగా కాంపౌండ్ కు ఇబ్బందికరంగా మారింది. రికార్డులు తమ కాంపౌండ్ కే పరిమితమవ్వాలనే టార్గెట్ తో పనిచేసే మెగా కాంపౌండ్, ఇప్పుడు బాహుబలి-2కు పోటీగా సైరాను రంగంలోకి దించుతోంది. పైకి చెప్పకపోయినా సైరా టార్గెట్ బాహుబలి-2 మాత్రమే. మరి 2.O, సాహో సినిమాల వల్ల కానిది సైరా వల్ల అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!