గతంలో ఎప్పుడూ లేని విధంగా 81 మందితో టీటీడీకి జంబో బోర్డు ఏర్పాటు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు అఃభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లేఖ రాశారు. టీటీడీలో కళంకితులకు చోటు కల్పించాలని ఆయన వాపోయారు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠను దెబ్బతీస్తే భవిష్యత్లో పశ్చాత్తాప పడాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వ చర్యలున్నాయని విమర్శించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన టీటీడీకి ముందెన్నడూ లేని విధంగా 81మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం గర్హణీయమన్నారు.
వ్యాపార , రాజకీయ ప్రయోజనాలతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారని చంద్రబాబు ఆరోపించారు. తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక అని.. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరమన్నారు.
భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన టీటీడీ బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్తులు, కళంకితులకు చోటు కల్పించారని చంద్రబాబు ఆరోపించారు. దీన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
భక్తుల మనోభావాలకు భిన్నంగా ఏర్పాటు చేసిన జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలని.. టీటీడీ సంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడం గమనార్హం.
గతంలో తాను ఏర్పాటు చేసిన బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్తులు, కళంకితులకు చోటు కల్పించిన విషయాన్ని ప్రతిపక్షంలోకి రాగానే చంద్రబాబు మరిచిపోయారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తాను విలువలు పాటించి, ఇతరులకు చెబితే బాగుండేదని చంద్రబాబుకు హితవు పలకడం గమనార్హం.