మూడు నెలల క్రితం మాట. ‘ చంద్రబాబు గారూ మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి వుంది. మీరు ఢిల్లీకి తరచూ ఎందుకు రావడం లేదు? ఈ దఫా వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేయండి. మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి వుంది. మీ కోసం అన్ని పనులు వదులుకుంటా’ అని ప్రధాని మోదీ అన్నట్టు ఎల్లో మీడియా, టీడీపీ విస్తృతంగా ప్రచారం చేయడం తెలిసిందే.
ఏపీలో చంద్రబాబు చాలా బిజీగా వుండడం వల్ల ఢిల్లీకి వెళ్లే తీరికలేదు. అందుకే ప్రధాని మోదీకి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చంద్రబాబు నుంచి పాఠాలు నేర్చుకునే అదృష్టం మోదీకి దక్కలేదు. అంతా మోదీ దురదృష్టం. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లలేదు కానీ, మోదీనే ఆంధ్రాకు వస్తున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని విశాఖకు చేరుకోనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పనిలో పనిగా మిత్రపక్షమైన జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కూడా మోదీ కలవనున్నారు. కానీ గురువు గారైన చంద్రబాబును మాత్రం ఆయన కలవలేకపోవడం ఆశ్చర్యమే. ఈ దఫా మీకు సమాచారం పంపిస్తానని మోదీ చెప్పి మూడు నెలలైంది. విశాఖ పర్యటన నేపథ్యంలో చంద్రబాబును మోదీ గుర్తు చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో, అలాగే దేశ వ్యాప్తంగా పొత్తులు, ఎత్తుగడలు తదితర అంశాలపై బీజేపీకి దిక్కుతోచడం లేదట. ఈ విషయాలపై ఎలా ముందుకెళ్లాలో చంద్రబాబు లాంటి అపర చాణక్యుడితో చర్చిస్తే…. మంచి పరిష్కారం దొరికే అవకాశాలున్నాయి. మరెందుకనో బాబును మోదీ కలిసే కార్యక్రమం ఏదీ లేనట్టుంది. హేమిటో, ఆంధ్రాకు వచ్చి.. చంద్రబాబుతో భేటీ అయి, చాలా విషయాలు మాట్లాడే సువర్ణ అవకాశాన్ని కోల్పోతున్నాననే స్పృహ కూడా మోదీకి లేకుండా పోయింది.