పవన్ కళ్యాణ్ దీనావస్థ చూస్తోంటే జాలేస్తోంది. ఆయనేమో పదేపదే ‘నాకు ప్రధాని నరేంద్ర మోడీ చాలా సన్నిహితుడు’ అని చెబుతూ ఉంటారు! ‘ప్రధాని నరేంద్ర మోడీ వద్ద తాను ఎంత చెబితే అంత’ అనే మాట పలకరు గానీ దాదాపు అదే స్థాయిలో బిల్డప్‌లు ఇస్తూ ఉంటారు!! కానీ ప్రధాని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌ను పట్టించుకున్న దాఖలాలు మనకు ఎక్కడా కనిపించవు.
భీమవరం వచ్చినప్పుడు ఆహ్వానం కూడా పంపకపోవడం లోనే పవన్ కళ్యాణ్ కు ఆయన వద్ద ఉన్న ప్రాధాన్యం ఏమిటో బయటపడింది. విశాఖలో కూడా అదే మళ్లీ రిపీట్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ మొత్తానికి అదే విశాఖలో, బహిరంగ సభ వేదిక మీదికి వెళ్ళకపోయినప్పటికీ ప్రధాని మోడీని ప్రత్యేకంగా కలవడానికి ఏర్పాటు చేసుకొని పరువు కాపాడుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసం ఒక ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్లి మోడీని కలవబోతున్నారు.
‘ప్రధాని మోడీని కలవాలంటే విశాఖకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదా’ అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది! విశాఖ కార్యక్రమంలో పాల్గొనే ప్రధాని ఆ తర్వాత వెంటనే హైదరాబాద్‌కు కూడా రానున్నారు. హైదరాబాదు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఒక బహిరంగ సభను బిజెపి ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత ఆయన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి వెళతారు. పవన్ కళ్యాణ్, మోడీతో భేటీ కాదల్చుకుంటే బేగంపేటలో కూడా భేటీ కావచ్చు కదా ప్రత్యేకించి పని కట్టుకొని విశాఖపట్నం వెళ్లడం ఎందుకు? అనేది సామాన్యంగా ఎవరికైనా కలిగే సందేహం!
అయితే వాస్తవం ఏమిటంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ.. పవన్ కళ్యాణ్‌ను, జనసేనను అసలు సోదిలో కూడా లెక్క చేయడం లేదు! అలాగని ఏపీ బీజేపీ నెత్తిన పెట్టుకుంటూ ఉందని కాదు. కనీసం ‘జనసేన మా భాగస్వామ్య పార్టీ, మేం కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాం’ అని తరచూ ప్రకటనలు గుప్పిస్తూ.. తెలుగుదేశం పల్లకి మోయాలనే పవన్ కళ్యాణ్ ఆశకు చెక్ పెడుతూ, బ్రేకులు వేస్తూ ఉంటుంది.
అదే తెలంగాణ బిజెపి అయితే.. పవన్ ను దగ్గరకు కూడా రానివ్వదు. బిజెపితో ఉన్న బంధాన్ని వాడుకుని తెలంగాణలో కూడా తమ పార్టీ ఆస్తిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయనకు కోరిక ఉన్నది గాని బిజెపి పొసగనివ్వదు.
ఇంతకూ అసలు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి పార్టీ నాయకుడేనా కాదా అనే సందేహం ఈ పరిణామాలు చూసిన ఎవ్వరికైనా కలుగుతుంది. కూటమిలో ఒకరు భాగస్వామి అయితే వారికి బలం లేని రాష్ట్రంలో భాగస్వామికి కాస్త విలువ ఇవ్వడం.. బలమున్న రాష్ట్రంలో అదే పార్టీని చులకనగా చూడడం.. ఏరకంగా కూటమి ధర్మం అనిపించుకుంటుంది? అనేది ప్రజల మదిలో మెదిలే సందేహం!
పవన్ కళ్యాణ్ ఇంత లోతుగా ఆలోచిస్తున్నట్లు లేరు! నరేంద్ర మోడీ ఏపీ తరువాత తెలంగాణకు వచ్చినప్పటికీ తెలంగాణ బిజెపి తనను ఆయన దగ్గరకు కూడా రానివ్వదు గనుక, ఆయన విశాఖకే వెళ్లి కలవడానికి నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకూ ప్రధానితో భేటీలో ఏం మాట్లాడతారు? జగన్ మీద పితురీలు చెబుతారా? లేదా, చంద్రబాబు పల్లకీ మోయడానికి నరేంద్ర మోడీని కూడా ఒక చేయి వేయాలని ఆహ్వానిస్తారా? బిజెపితో తెగతెంపులు చేసుకునే ప్రతిపాదనలను ఆయన ముందు పెడతారా? అనేది వేచి చూడాలి!