నవంబరు 12న ఒకే విడతలో హిమాచల్ ఎన్నిక జరగబోతోంది. అయితే ఫలితం మాత్రం డిసెంబరు 8న వెలువరిస్తారు. చిన్న రాష్ట్రం, ఓటర్ల సంఖ్య 50 లక్షలు మాత్రమే. ఓట్ల లెక్కింపుకి అంత జాప్యం ఎందుకు అంటే గుజరాత్‌లో ఎన్నికలు డిసెంబరు 1, 5 తేదీల్లో ఉన్నాయి. హిమాచల్‌లో ఫలితం తేడా కొడితే దాని ప్రభావం మోదీ, షాలకు అత్యంత ముఖ్యమైన గుజరాత్ రాష్ట్రంపై పడుతుందని బిజెపి వాళ్లు భయపడ్డారని తెలుస్తోంది. పైగా ఎన్నికల కమిషన్ హిమాచల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించకూడదని ఆదేశమిచ్చింది. అంటే హిమాచల్‌లో విజయం తథ్యం అనే ధీమా బిజెపికి లేదన్నమాట.
ఇది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. హిమాచల్‌లో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కారు. బిజెపి నిర్వచనం ప్రకారం అభివృద్ధి జోడు పట్టాల మీద పరిగెడుతూ ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెసు. బిజెపితో నేరుగా తలపడిన ప్రతీ సందర్భంలోనూ అది ఓడిపోతూనే ఉంది. పైగా వీరభద్ర సింగ్ వంటి పెద్ద నాయకుడి మరణం తర్వాత కాంగ్రెసుకు పెద్ద నాయకుడు లేడు. ఏదో నలుగురు ఉన్నారనుకుంటూ ఆ నలుగురూ ముఖ్యమంత్రి పదవికై పోటీ పడుతూ కుమ్ములాడుకుంటున్నారు. వాళ్లని అదలించవలసిన అధిష్టానం తనే చిక్కుల్లో పడి కొట్టుకుంటోంది. మరి బిజెపి దేన్ని చూసి భయపడుతోంది?
1985 నుంచి ప్రతీ ఐదేళ్లకూ హిమాచల్ అట్టు తిరగేస్తూనే ఉందని, ఆ సంప్రదాయం యీసారీ కాపాడుతుందని కాంగ్రెసు ఆశ, బిజెపి భయం. అయితే దానికో ధీమా ఉంది. కాంగ్రెసు తరఫున ప్రియాంకా రాష్ట్రమంతా తిరిగింది. గాంధీ కుటుంబీకులు ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెసు ఓడడం ఖాయమనే సంప్రదాయం ఉందిగా, అది యీ అట్టు తిరగవేత సంప్రదాయాన్ని ఎదుర్కుంటుందని బిజెపి లెక్క. 2017 ఎన్నికలలో 49% ఓట్లతో 44 (గతంలో 26) సీట్లు పొందిందది. 42% ఓట్లతో కాంగ్రెసు 21 సీట్లు (గతంలో 36) తెచ్చుకుంది. 2012-17 మధ్య కాంగ్రెసు 1% ఓట్లు మాత్రమే పోగొట్టుకుంది. కానీ బిజెపి 10% ఓట్లు పెంచుకుంది. అంటే తక్కిన అభ్యర్థులు తుడిచిపెట్టుకుపోయి, ముఖాముఖీ పోటీలో బిజెపి గెలిచింది.
డబుల్ ఇంజన్ వలన తమకు ఒనగూడిందేమీ లేదని హిమాచల్ ఓటరు అసంతృప్తితో ఉన్నాడని కొందరు చెప్తున్నారు. ధరల పెరుగుదల దేశమంతా ఉన్న సమస్యే. దానికి తోడు పాత పెన్షన్ స్కీం అమలు చేయలేదని 2 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెసు, ఆప్ పాత స్కీము తెస్తామని హామీ యిచ్చాయి. నిరుద్యోగం మరో పెద్ద సమస్య. జాతీయ స్థాయిలో నిరుద్యోగిత 7.6% ఉంటే హిమాచల్‌లో 9.2% వరకు ఉందట. ఎంత వరకు నిజమో తెలియదు కానీ మొత్తం 50 లక్షల మంది ఓటర్లుంటే వారిలో 15 లక్షల మంది నిరుద్యోగ యువత ఉందని చదివాను. గిట్టుబాటు ధర లేదని, జిఎస్టీ భారమైందనీ యాపిల్ రైతులు కూడా అసంతృప్తిగా ఉన్నారట. దీనితో పాటు జనాభాలో 10% మంది సైనిక కుటుంబాల వాళ్లే. వాళ్లు బాగా పెద్ద సంఖ్యలో ఉన్న హమీర్పూర్, ఉనా వంటి జిల్లాలలో అగ్నిపథ్ పథకం ఎన్నికల అంశమై పోయింది. అగ్నిపథ్ కారణంగా రాష్ట్రం నుంచి నియామకాలు మూడో వంతు తగ్గబోతున్నాయి. వీళ్లు బిజెపికి వ్యతిరేకంగా ఓటేస్తారని ఒక అంచనా.
హిమాచల్ జనాభాలో మహిళలు 49% ఉన్నారు. మహిళా అక్షరాస్యత ఎక్కువ. వ్యాపారాలు కూడా నడుపుతారు. రాజకీయ చైతన్యమూ ఎక్కువే. వాళ్లు మగవాళ్ల కంటె 7% ఎక్కువగా ఓట్లేస్తున్నారు. అందుకని పార్టీలు వారిని ఉద్దేశించి హామీలు గుప్పిస్తున్నాయి. బిజెపి వారికై ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. విద్య, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ యిస్తానంటోంది. ఆప్ 18 ఏళ్లు దాటిన మహిళందరికీ నెలకు రూ. వెయ్యి యిస్తానంటే కాంగ్రెసు రూ.1500 యిస్తానంటోంది. అభ్యర్థి ఎంపిక దగ్గరకు వచ్చేసరికి యీ రిజర్వేషన్లు ఏమయ్యాయో తెలియదు. బిజెపి ఆరుగురికి టిక్కెట్టిస్తే, కాంగ్రెసు దానిలో సగం ముగ్గురికే యిచ్చింది.
అంతర్గత కలహాలకు కాంగ్రెసు పెట్టింది పేరు. అయితే హిమాచల్‌లో బిజెపికి కూడా ఆ సమస్య ఎదురైంది. మొత్తం 68 సీట్లుంటే, 20 స్థానాల్లో రెబెల్స్ స్వతంత్రులుగా నిలబడ్డారు. వీళ్లని విత్‌డ్రా చేయించడంలో బిజెపి నాయకత్వం విఫలమైంది. మోదీ వచ్చి హెచ్చరించ వలసి వచ్చింది. కాంగ్రెసు రెబెల్స్ 12 స్థానాల్లో నిలబడ్డారు. నియోజకవర్గాల్లో ఓట్లు తక్కువ, విన్నింగ్ మార్జిన్లూ తక్కువే. 5% తేడాతో గెలుపుఓటములు ఉంటాయి. అలాటప్పుడు రెబెల్స్ విజయావకాశాలను చెడగొట్టగలరు. అదీ భయం.
పొరుగున ఉన్న పంజాబ్‌లో అధికారంలోకి వచ్చేసిన ఆప్ యిక్కడ 67 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెసు, బిజెపిల మధ్య బంతిలా తిరుగుతున్న హిమాచల్‌కు మూడో ప్రత్యామ్నాయంగా నేనున్నాను అంటూ ఆప్ వస్తోంది. నిజానికి రెండు ప్రధాన పార్టీలపై అసంతృప్తితో హిమాచల్ ఓటర్లు 2017లో నోటాకు గణనీయంగా ఓటేయడంతో 12 స్థానాల్లో నోటా మూడో స్థానంలో నిలిచింది. అలాటి ఓటర్లను ఆకర్షించడానికి ఆప్ ప్రయత్నిస్తోంది, దిల్లీకి సరిహద్దు రాష్ట్రమే కాబట్టి దిల్లీలో ఆప్ పరిపాలన మెచ్చినవారు యిక్కడా ఓటు వేయవచ్చని దాని ఆశ. ప్రభుత్వ వ్యతిరేకత ఓటును ఆప్ చీల్చడం ద్వారా కాంగ్రెసు దెబ్బ తిని మనం లాభపడవచ్చు అని బిజెపి ఊహ. కానీ ఆప్ ఏ మాత్రం ప్రభావం కలిగించ లేకపోతోందని విశ్లేషకులు అంటున్నారు. బియస్పీ 53 స్థానాల్లో పోటీ చేస్తోంది. యుపిలోనే దాని పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఇక్కడేం చేయగలుగుతుందో తెలియదు. 2017లో 1 స్థానం గెలిచిన సిపిఎం యిప్పుడు 11 స్థానాల్లో పోటీ చేస్తోంది.
హిమాచల్ ఎన్నికలో కాంగ్రా జిల్లాకు ప్రాధాన్యత ఉంది. ఇక్కడ అగ్రకులాలే ఎక్కువ శాతం ఉన్నారు. కానీ ఏ పార్టీకి మూకుమ్మడిగా ఓటేయటం లేదు. 1993 నుంచి యీ జిల్లాలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్లే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 68 సీట్లలో 15 సీట్లు యిక్కడే ఉన్నాయి. 2012లో కాంగ్రెసుకు 10 వచ్చి, అధికారంలోకి వచ్చింది. 2017లో బిజెపికి 11 వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు పార్టీలకూ 40% ఓట్లు స్థిరంగా ఉన్నా, 3-5% మంది స్వింగ్ ఓటర్ల కారణంగా ఫలితాలు తారుమారవుతున్నాయి. రాజపుత్రులు 34%, బ్రాహ్మణులు 20% ఉన్నా బిజెపికి దడగానే ఉండడానికి కారణం పరిపాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉండడమే అంటున్నారు.
బిజెపి 11 చోట్ల తన సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చేయడం, యిద్దరు మంత్రుల నియోజకవర్గాలు మార్చడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఒప్పుకున్నట్లయిందని, గెలుపుపై దృఢనమ్మకం లేదనే సంకేతాన్ని ఓటర్లకు పంపించి నట్లయిందని దాని అభిమానులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టు మోదీ వచ్చి అభ్యర్థి ఎవరో ఓటర్లు పట్టించుకోనక్కర లేదని, కమలాన్ని గుర్తు పెట్టుకుంటే చాలని అన్నారు. ఇతర బిజెపి నాయకులు మోదీ మొహం చూసే ఓటేయమంటున్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ యిదే జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థికి ప్రాధాన్యత ఉండటం లేదు, మోదీయే వచ్చి ఎన్నిక గెలిపించాల్సి వస్తోంది. ఇది ముఖ్యమంత్రి అసమర్థపాలనకు నిదర్శనం అంటోంది కాంగ్రెసు.
బిజెపి అధ్యక్షుడు నడ్డాకు హిమాచల్ స్వరాష్ట్రం. అందువలన యీ ఎన్నిక ఆయనకు ప్రతిష్ఠాత్మకం. మోదీ ఎలాగూ ప్రచారానికి వచ్చారు. కానీ ప్రధానంగా బిజెపి ప్రచారమంతా జాతీయ అంశాల చుట్టూ తిరిగింది. కశ్మీర్‌లో 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, యునిఫామ్ సివిల్ కోడ్ పెడతాననడం, మిలటరీ విజయాలు యిలాటి వాటి మీదే సాగిస్తున్నారు. కాంగ్రెసు మాత్రం ప్రభుత్వ వైఫల్యాల గురించి, స్థానిక సమస్యల గురించి మాట్లాడుతోంది. బిజెపి వాటిపై మాట్లాడడానికి యిష్టపడటం లేదు. ఈ ఎన్నికలలో బిజెపి, కాంగ్రెసులకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో ఆప్, స్వతంత్రులు కీలకమైన పాత్ర వహిస్తారు. 2017లోనే ఆరుగురు యిండిపెండెంట్లు నెగ్గారు. అధికారానికి కాస్త దగ్గరగా వస్తే చాలు బిజెపి వాళ్లని లాక్కుని అధికారంలోకి వచ్చేస్తుందని అనుకోవచ్చు. ఇప్పటి కాంగ్రెసు దుస్థితి చూసి, బిజెపి సునాయాసంగా నెగ్గేస్తుందని అనుకుంటాం. ఎందుకోగాని అది నెర్వస్‌గా ఉందని తోస్తోంది. లేకపోతే దాదాపు నెలపాటు ఫలితాలు వెల్లడించకుండా, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించకుండా ఆపి ఉండదు.