ఈగో చల్లారింది.. ఇక అంతా నార్మలే!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నరుకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన, మాటలు రువ్వుకోవడం లాంటి ఎపిసోడ్ కు ప్రస్తుతానికి తెరపడినట్టే. బిల్లులపై సంతకం పెట్టకుండా.. నన్ను కలవడం లేదు, నా సందేహాలు తీర్చడం లేదు అని…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నరుకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన, మాటలు రువ్వుకోవడం లాంటి ఎపిసోడ్ కు ప్రస్తుతానికి తెరపడినట్టే. బిల్లులపై సంతకం పెట్టకుండా.. నన్ను కలవడం లేదు, నా సందేహాలు తీర్చడం లేదు అని భీష్మించుకున్న గవర్నరు తమిళిసైను ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిశారు. ఆమె సందేహాలకు వివరణ ఇచ్చారు.

యూనివర్సిటీల్లో ఖాళీలు వెంటనే భర్తీచేసేందుకే ఉమ్మడి నియామకాల బోర్డు ఏర్పాటు చేసినట్టు.. మంత్రి , గవర్నరుకు చెప్పారు. ఆమె కొన్ని సూచనలు చేశారు. లీగల్ చిక్కులు రాకుండా చూడాలని, త్వరగా భర్తీలు చేయాలని అన్నారు. అక్కడితో ఆ వివాదం సమసిపోయింది. 

ఈ వ్యవహారాన్ని దాటి గవర్నరు తమిళిసై మాట్లాడిన మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రభుత్వం యూనివర్సిటీ నియామకాల గురించి బోర్డు ఏర్పాటు చేయగానే.. దానికి సంబంధించి పలువరు ఆందోళన చెందుతూ తన దృష్టికి తెచ్చినందునే తాను వివరణ కోరినట్లుగా ఆమె చెప్పుకున్నారు.

యూనివర్సిటీ హాస్టళ్లు, ల్యాబ్ లు మెరుగుపరచాలని, డిజిటల్ వనరులు కల్పించాలని సాదాసీదా సూచనలు కూడా చేశారు. నిజానికి ఇవన్నీ గవర్నరు ఏ సందర్భంలోనైనా రాష్ట్రప్రభుత్వానికి చేయదగిన సూచనలు. చాలా సాధారణమైన విషయాలు. అయితే.. తాను వివరణ కోరితే ప్రభుత్వం తన వద్దకు రావాలనే కోరిక తీరడంతో.. వారికి సూచనలు చేశారు. 

కొత్తగా ఛాన్సలర్ కనెక్ట్ కార్యక్రమాన్ని అన్ని యూనివర్సిటీల్లోనూ నిర్వహించాలని గవర్నరు సూచించడం ఆసక్తికరంగా ఉంది. దీనికింద యూనివర్సిటీల మెరుగుకోసం పూర్వవిద్యార్థుల భాగస్వామ్యం పెంచడానికి కార్యక్రమం ఉండాలనేది తమిళిసై సూచన!

అంటే.. ఈ ప్రకారం పూర్వవిద్యార్థులతో ఆమె స్వయంగా సమావేశం అవుతారన్నమాట. యూనివర్సిటీల బాగుకోసం వారిని అభ్యర్థిస్తారన్నమాట. ఈ ప్రయత్నం అచ్చం రాజకీయం లాగానే కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంలోకి వచ్చే రాజకీయ నాయకులు చేసే ఆలోచనను.. రాజ్యాంగ పదవిలో ఉన్న తమిళిసై చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఛాన్సలర్ పూర్వవిద్యార్థుల్ని కలవడం, సమావేశాలు నిర్వహించడం తప్పేమీ కాదు.. కానీ.. అలా ప్రజల్లోకి వెళుతూ వారిలో ఒక క్రేజ్ తెచ్చుకోవాలనుకోవడం రాజకీయ లక్షణం. గవర్నరు పదవిలో ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నాయకురాలిలాగా మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు మీద విమర్శలు చేస్తూ ఉండే తమిళిసై.. ఇలా చాన్సెలర్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా వర్సిటీల పూర్వవిద్యార్థుల్లో ప్రముఖుల్ని, ఉన్నతస్థానాలకు వెళ్లిన వారిని తరచూ కలుస్తూ ఉంటే.. ఆ భేటీలు రాజకీయ రూపు సంతరించుకోకుండా ఉంటాయా అనేది కూడా ఒక అనుమానం. మొత్తానికి ప్రస్తుతానికి గవర్నరు- తెలంగాణ సర్కారు నడుమ ఉన్న ఒక వివాదం సద్దుమణిగింది.