గజమాల వేసుకోగానే గెలుపుయోగం వస్తుందా?

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొత్త కృష్ణుడు ఎంట్రీ ఇచ్చారు. బీసీలకు పదవులు కట్టబెట్టేస్తున్నాం అనే నినాదాన్ని పదేపదే టముకు వేసుకుంటూ.. ఆల్రెడీ శవాసనం వేసిన పార్టీకి అధ్యక్షస్థానంలో ఏరి మరీ కూర్చోబెడుతున్నారు చంద్రబాబునాయుడు.  Advertisement…

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొత్త కృష్ణుడు ఎంట్రీ ఇచ్చారు. బీసీలకు పదవులు కట్టబెట్టేస్తున్నాం అనే నినాదాన్ని పదేపదే టముకు వేసుకుంటూ.. ఆల్రెడీ శవాసనం వేసిన పార్టీకి అధ్యక్షస్థానంలో ఏరి మరీ కూర్చోబెడుతున్నారు చంద్రబాబునాయుడు. 

తొలుత ఎల్.రమణకు పగ్గాలు అప్పగిస్తే.. తెరాసతీర్థం పుచ్చుకుని ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత బక్కని నర్సింహులు చేతిలో పెట్టారు. పార్టీ అతీగతీ లేకుండా అలాగే పడి ఉంది. ఆయన మదిలో ఏ పురుగు తొలిచిందో ఏమో.. కాసాని జ్ఞానేశ్వర్ చేతిలో పెట్టారు. ఆయన పదవీ స్వీకారోత్సవం సందర్భంగా భారీ కార్యక్రమం నిర్వహించారు. 

బహుశా చంద్రబాబునాయుడు ఈరోజున చాలా చాలా మురిసిపోయి ఉంటారు. తెలంగాణ రోడ్ల మీద ఆయన ఓపెన్ టాప్ వాహనం ఎక్కి పూలు చల్లించుకుంటూ ఊరేగి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో.. ఇవాళ కాసాని పుణ్యమాని ఆయన అలా ఊరేగారు. ఈ సందర్భంగా వారిద్దరికీ కలిపి అభిమానులు గజమాల కూడా వేసి అభినందించారు. గజమాల వేసుకునే మురిపెం బాగానే ఉంది గానీ.. అంతమాత్రాన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గెలుపుయోగం పడుతుందా? అనేదే అందరి మదిలో మెదలుతున్న సందేహం. 

తెలంగాణలో పార్టీ సర్వనాశనం అయిపోయి చాలా కాలం అయింది. ఇన్నాళ్లుగా ఆ పార్టీని తిరిగి గాడిలో పెట్టడం గురించి గానీ, ఉద్ధరించడం గురించి గానీ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడేదో కాసాని జ్ఞానేశ్వర్ తో డీల్ కుదిరినట్లుంది. పార్టీ శవాసనం వేసి ఉన్నా.. అంతో ఇంతో ప్రజలకు తెలిసిన పేరు గనుక.. దాని ద్వారా తాను రాజకీయ ప్రయోగం చేయాలనేది కాసాని కోరిక కావొచ్చు. కానీ.. ఆ తెలుగుదేశం అనే పేరుకు తెలంగాణ వ్యాప్తంగా అనల్పమైన అపకీర్తి ఉన్నది కదా.. దానిని కూడా ఆయన మోయడానికి సిద్ధపడ్డారని అనుకోవాలి. 

అయితే ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడూ, తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడూ ఇద్దరూ కూడా చాలా చాలా కామెడీ పండించారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని చంద్రబాబు అంటే.. కాసాని జ్ఞానేశ్వర్ ఇంకా టూమచ్ కామెడీ చేశారు. 

రాబోయే ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇటు తెలంగాణలోనూ కూడా తెలుగుదేశం అధికారంలోకి రాబోతున్నదని జోస్యం చెప్పారు. నాయకులు ఇంతింత భ్రమల్లో బతుకుతూ ఉంటే.. ఆ పార్టీ ఎలా బాగుపడుతుంది. ఏదో ప్రాక్టికల్ అప్రోచ్ తో బలం పెంచుకోడానికి ట్రైచేస్తే ఓకే గానీ.. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం అనే వాళ్లను ఎవరు బాగుచేయగలరు?