జనసేనాని పవన్‌కల్యాణ్ కష్టం పగవాళ్లకు కూడా రావద్దని కోరుకునే పరిస్థితి. ఎవరైతే తనకెంతో ఇష్టం, గౌరవమని పదేపదే పవన్‌కల్యాణ్ చెబుతుంటారో, ఆయన దర్శనానికి 8 ఏళ్లకు పైబడి సమయం పట్టింది. పైగా బీజేపీకి పవన్‌కల్యాణ్ మిత్రపక్షం కూడా. ఒక నాయకుడికి ఇంతకంటే అవమానం మరొకటి వుంటుందా? పవన్‌కల్యాణ్ తెల్లారి లేచినప్పటి నుంచి ప్రత్యర్థి వైఎస్ జగన్‌పై విషం కక్కుతుంటారు.
మిత్రులనే బీజేపీ, టీడీపీ నేతలు చేసిన అవమానంతో పోల్చితే… జగన్ చేసిందేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానిగా చిన్నాచితక నేతలకు కూడా మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అంతెంతుకు మంచు మోహన్‌బాబు కుటుంబం మోదీని కలవలేదా? మరి పవన్‌కు ఆ ప్రాధాన్యం ఎందుకు ఇవ్వలేదనేది ప్రశ్నగా మిగిలింది. ప్రధాని విశాఖ పర్యటనలో భాగంగా పవన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడం విశేషం.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్ వెళ్లిన మోదీని పవన్ కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొని…టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించారు. 2014 ఎన్నికల తర్వాత పవన్‌కు మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పవన్‌కల్యాణ్ బీజేపీకి దూరమయ్యారు.
2019 ఎన్నికల తర్వాత మళ్లీ ఆయనే బీజేపీ చెంతకు వెళ్లారు. పొత్తు కుదుర్చుకున్నప్పటికీ కలిసి పని చేయడం లేదు. అలాగే పక్క చూపులు చూస్తున్నారనే ఫిర్యాదులు బీజేపీ అధిష్టానానికి వెళ్లాయి. జగన్‌ను గద్దె దించడానికి రోడ్‌మ్యాప్ కావాలని పవన్ అడిగి కూడా ఆరు నెలలు దాటింది.
ఇంత వరకూ పవన్ విజ్ఞప్తిని బీజేపీ పట్టించుకోకపోగా, రోడ్‌మ్యాప్ ఇచ్చామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పవన్‌కు మోదీ దర్శన భాగ్యం కలగడం వెనుక బీజేపీ ఏదో వ్యూహం పన్నిందనే చర్చ జరుగుతోంది. అదేంటో మోదీతో భేటీ తర్వాత పవన్ చెప్పడం ద్వారా తెలిసే అవకాశం వుంది.