ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అసమ్మతి తలనొప్పిగా మారింది. మొన్న కళ్యాణదుర్గం, నిన్న సత్తెనపల్లి…తెలుగు తమ్ముళ్లు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీలో అసమ్మతికి మాత్రం తక్కువేం లేదు.
ఇప్పటికే 126పైగా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్గత కుమ్ములాటలను భరించనని చంద్రబాబు పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. టీడీపీ అగ్రనాయకుల ఎదుటే తెలుగు తమ్ముళ్లు కుర్చీలతో కొట్టుకోవడం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది.
టీడీపీలో అసంతృప్తి, అసమ్మతి నివురుగప్పిన నిప్పులా వుంది. ఉదాహరణకు ఉమ్మడి అనంతపురం జిల్లానే తీసుకుందాం. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలతో జేసీ బ్రదర్స్‌కు అసలు పొసగడం లేదు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా మరో నాయకుడిని జేసీ బ్రదర్స్ తెరపైకి తెచ్చారు. పల్లెకు సీటు ఇస్తే, ఓడిపోవడం ఖాయమని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఊరూరా ప్రచారం చేస్తున్నారు.
ప్రభాకర్ చౌదరి, జేసీ బ్రదర్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. కడప జిల్లాకు వెళితే… ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, పార్టీ ఇన్‌చార్జ్ ఉక్కు ప్రవీణ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తన నాయకత్వానికి ఉక్కు ప్రవీణ్ గండికొట్టాడంటూ అక్కసు పెంచుకున్నాడాయన. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేశ్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి, కొత్తగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మధ్య మళ్లీ టికెట్ పోరు నడిచే అవకాశాలున్నాయి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాకు వెళితే టీడీపీ కుక్కలు చించిన విస్తరిలా తయారైంది.
నంద్యాలలో తన అన్న బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌కు వ్యతిరేకంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆళ్లగడ్డలో కాకుండా తమ నియోజకవర్గానికి రావడం ఏంటంటూ అఖిలప్రియపై వాళ్లిద్దరూ గుర్రుగా ఉన్నారు. తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారనే అక్కసుతో బీసీ జనార్ధన్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు అఖిలప్రియ బనగానపల్లెలో భూమ వర్గాన్ని అలర్ట్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక డోన్‌లో కేఈ కుటుంబాన్ని కాదని కొత్తగా సుబ్బారెడ్డిని తెరపైకి తేవడంతో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. తిరుపతిలో కూడా ఇదే తంతు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వ్యతిరేకంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలు చాపకింద నీరులా అసమ్మతి కార్యకలాపాలు నడుపుతున్నారు. సత్యవేడు, జీడీనెల్లూరు, చిత్తూరులలో కూడా అసమ్మతి బలంగానే వుంది. తమను కాదని మరొకరికి టికెట్ ఇస్తే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇలా ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీకి అసమ్మతి తలబొప్పి కట్టిస్తోంది. ముందుగా సొంతింటిని చక్క దిద్దుకోవాల్సిన ఆవశ్యకతను తమ్ముళ్ల తన్నులాటలు తెలియజేస్తున్నాయి. టీడీపీకి పట్టిన అసమ్మతి చీడను పోగొట్టకుండా, వైసీపీని ఎదుర్కోవడం ఎంత వరకూ సాధ్యమో చంద్రబాబుకే తెలియాల్సి వుంది.