ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూస్తుంటే ఇదే పాట ప్రతి చోటా ఇలాగే పాడుకుంటాను అనే పాత సినిమా పాట గుర్తుకొస్తోంది. ఏపీలో పాడుకుంటున్న పాట ఏమిటీ అంటారా ? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత మంత్రుల గుండెల్లో రాయి పడేలాగా రైళ్లు పరుగెత్తేలాగా ఓ మాట చెప్పారు. ఇప్పుడున్న మంత్రులే ఐదేళ్లూ కొనసాగుతారని అనుకోవద్దని, సరిగ్గా రెండున్నరేళ్ల తరువాత కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అన్నారు.
ఇలా ఏ ముఖ్యమంత్రీ కుర్చీలో కూర్చోగానే మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేయడు. ఆందోళన, భయం క్రియేట్ చేయడు. కానీ జగన్ మాత్రం మీ పదవులు శాశ్వతం కావు అని స్పష్టంగా చెప్పారు. అదీ జగన్ తీసుకున్న డేరింగ్ స్టెప్. జగన్ పాలనలో యాభై శాతం పూర్తి కావొస్తోంది. అంటే రెండున్నరేళ్లు పూర్తి కావొస్తున్నాయన్న మాట. దీంతో కొన్నాళ్లుగా ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎవరుంటారు ? ఎవరు పోతారు ? అనే చర్చ జోరుగా సాగుతోంది.
మంత్రివర్గంలో 90 శాతం మందిని మారుస్తారని కొందరు అంటుంటే, పని తీరును బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి కొందరు అంటున్నారు. మంత్రివర్గ మార్పులు ఇప్పుడు కాదని మరో ఆరు నెలలు ఇదే మంత్రివర్గాన్ని కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణ మరో ఆరు నెలలు వాయిదా వేయాలని జగన్ నిర్ణయంచారని సమాచారం. నిజానికి మరికొద్ది రోజుల్లో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగాలి. జగన్ ప్రమాణస్వీకారానికి ముందు ప్రస్తుత మంత్రివర్గం కాలవ్యవధి రెండున్నరేళ్లు అని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90 శాతం మందిని మారుస్తానని కూడా జగన్ చెప్పారు.అయితే ప్రస్తుతం మంత్రి వర్గ విస్తరణను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని జగన్ నిర్ణయించారని సమాచారం. ఇందుకు గల కారణాలను కూడా వైసీపీ అగ్రనేతలు చెబుతున్నారు. మంత్రి వర్గం ఏర్పాటయిన తర్వాత ముప్పావు సమయం కరోనాతోనే గడచిపోయింది. మంత్రులు కూడా తమకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించలేకపోయారు.
తొలుత రెండున్నరేళ్లు అని అనుకున్నా మరో ఆరు నెలల సమయాన్ని ప్రస్తుత మంత్రులకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.కొత్త మంత్రివర్గాన్ని మూడేళ్ల తర్వాత అంటే మరో ఆరునెలల అనంతరం విస్తరించాలన్నది జగన్ ఆలోచన. ఇందులో కూడా పూర్తిగా ఎన్నికల టీమ్ ను నియమించాలని జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పదిశాతం మందిని ఉంచినా, 90 శాతం మంత్రుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఎక్కువ మంది కేబినెట్ లో బలహీన వర్గాల వారు ఉంటారన్నది పార్టీ వర్గాల ద్వారా విన్పిస్తున్న టాక్. వీరికి రెండేళ్ల పదవీ కాలం ఉంటుంది.కానీ మంత్రి వర్గ విస్తరణపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు.
ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం నేతలు అధిక మంది ఈసారి తమకు ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి వంటి నేతలు తమకు ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం వీరి ఆశలపై నీళ్లు చల్లిందనే చెప్పాలి.
జగన్ తొలి నుంచి ఒక మాట అంటే దాని మీద నిలబడతారు. తనను అధికారంలోకి తెచ్చిందే ఈ మనస్తత్వం అని నమ్ముతారు. అందుకే ఒకసారి డెసిషన్ తీసుకుంటే దానికి వెనక్కు తీసుకోరు. తన పరిధిలో ఉన్న అంశాల్లో మాత్రం జగన్ ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది అన్నది పక్కన పెడితే జగన్ మనసులో ఏముందన్నది ఎవరికీ తెలియదు. చివరి నిమిషంలో గాని మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్నది బయట ప్రపంచానికి తెలియదు. పార్టీలో సీనియర్ నేతలకు కూడా ఈ విషయం తెలిసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే తన మంత్రి వర్గ విస్తరణలో జగన్ ఎవరి సలహాలు తీసుకోరు.
తాను అనుకున్న సామాజిక సమీకరణల ఆధారంగానే జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపడతారు. అయితే ఇప్పడు రాష్ట్రంలో రానున్న మంత్రి వర్గ విస్తరణలో చోటు సంపాదించేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు జగన్ వద్ద చెల్లుబాటు కావన్నది కూడా నిజమే.ఈ పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్సీలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.
కానీ జగన్ ఎమ్మెల్సీలకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి బలమైన కారణం శాసనమండలిని రద్దు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించడమే. శాసనమండలి రద్దు కేంద్రం చేతిలో ఉంది. అది రద్దు అవుతుందో? లేదో? తెలియదు. అదే సమయంలో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను మంత్రి పదవికి రాజీనామాలు చేయించి రాజ్యసభకు పంపారు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
సామాజిక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఐదు డిప్యూటీ సీఎంల పోస్టులను సృష్టించారు. అన్ని వర్గాలకు తన మంత్రివర్గంలో చోటు కల్చించాలనే ఉద్దేశంతో ఆయన ఆ పనిచేశారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు లేదు. అయితే, జగన్ తన మంత్రివర్గంలో ఆంజాద్ బాషాకు డిప్యూటీ సిెం పదవి ఇచ్చారు. మంత్రుల పనితీరుపై జగన్ సమీక్ష నిర్వహించినప్పుడు కొద్ది మంత్రులు మాత్రమే సేఫ్ గా ఉన్నట్లు సమాచారం.
మంత్రి పదవులకు రాజీనామా చేసి, ఎంపీలుగా వెళ్లారు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. వారి స్థానంలో మధ్యలో మంత్రి పదవులు చేపట్టిన సిహెచ్ వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులను కొనసాగించే అవకాశం ఉంది. వారితో పాటు సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, పి. అనిల్ కుమార్ యాదవ్, కురుసాల కన్నబాబు, కొడాలి శ్రీవెంకటేశ్వర రావు అలియాస కొడాలి నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్,, మేకపాటి సుచరిత, బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి పదవులకు ఢోకా లేదని సమాచారం.
కాగా, ఆశావహుల జాబితా మాత్రం చాలా పెద్దగా ఉంది. టీటీడీ చైర్మన్ గా ఉన్న జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే, ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా మంత్రిపదవిని ఆశిస్తున్నారు.
అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను, శిల్పా చక్రపాణి రెడ్డి, గ్రంథి శ్రీనివాస్ రావు, ఆనం రామనారాయణ రెడ్డి, తలారి వెంకట్ రావు, కళావతి, ఉషశ్రీ చరణ్, కిలివేటి సంజీవయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొర, కేపీ పార్థసారథి, జోగి రమేష్, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తదితరులు క్యాబినెట్ బెర్తులను ఆశిస్తున్నారు. మరి ఎవరి జాతకం ఎలా ఉంటుందో. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే వరకు దాన్ని గురించి ఏపీ రాజకీయ నాయకులు కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఈ విషయంలో తెలంగాణలోనూ ఆసక్తిగానే ఉంది.
-నాగ్ మేడేపల్లి