ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని నెలలుగా వారు ఈ అంశంలో టెన్షన్ పడుతూ వచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అందరి అభ్యర్థుల పరిస్థితి ఇదే అని చెప్పాలి. అయితే టీడీపీ వాళ్లలో కొంతమంది ప్రచారం సమయానికే చేతులెత్తేశారు.
ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు పోలింగ్ కు ముందు ప్రకటించారు. అయితే టీడీపీ తరఫున నామినేషన్లు అయితే దాఖలు అయ్యాయి. ఎలాగూ ఫలితాలు దారుణంగా ఉంటాయనే లెక్కలతో చంద్రబాబు నాయుడు ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని ఎత్తుకున్నారు.
అయితే.. కొంతమంది టీడీపీ నేతలే దానికి ఒప్పుకోలేదు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ చార్జిలు ఈ ఎన్నికల్లో తమ అనుచరులు పోటీలో ఉంటారని ప్రకటించారు. చంద్రబాబు ప్రకటనకు వ్యతిరేకంగా వారు ప్రచారం చేసుకున్నారు, పోటీలో నిలిచారు. అయితే ఈ ఎన్నికలపై టీడీపీ కోర్టుకు వెళ్లింది. రద్దు చేయాలని కోరింది. సింగిల్ జడ్జి తీర్పుతో ఈ ఎన్నికలు రద్దు అయ్యాయి. అప్పుడు న్యాయం గెలిచిందంటూ చంద్రబాబు నాయుడు స్పందించారు. అయితే ధర్మాసనం మాత్రం ఈ ఎన్నికల నిర్వహణను సమర్థించింది. ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక కౌంటింగ్, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలింది. ఈ నెల 19వ తేదీన కౌంటింగ్ జరగనుంది. దీంతో ఏకగ్రీవం అయినవి పోనూ 7,220 ఎంపీటీసీ స్థానాలకూ, 515 జడ్పీటీసీ స్థానాలకూ జరిగిన పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. నామినేషన్లు వేసి చాలా కాలం అయిపోయింది, ప్రచారాలు పోలింగ్ ముగిసి కూడా మరెంతో కాలం అయిపోయింది.. తమ రాజకీయ భవితవ్యం ఏమిటో అని ఇన్నాళ్లూ ఎదురుచూసిన వాళ్లకు ఈ నెల 19తో క్లారిటీ రానుంది.