సింహం, లయన్ అనే పదాలు వచ్చేలా బాలకృష్ణ ఇప్పటికే చాలా టైటిల్స్ వాడేశాడు. ఇప్పుడు అందులోంచి ఓ టైటిల్ ను బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తీసుకోవాలనుకుంటున్నాడు. అవును.. తన కొత్త సినిమాకు లయన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడు కింగ్ ఖాన్.
కోలీవుడ్ కు చెందిన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు షారూక్. ప్రస్తుతం పూణెలో ఈ సినిమా షెడ్యూల్ నడుస్తోంది. ఈ మూవీకి సంబంధించి లయన్ అనే టైటిల్ బయటకొచ్చింది. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటోంది యూనిట్. బాలీవుడ్ మీడియా మాత్రం ఇదే ఒరిజినల్ టైటిల్ అంటూ ప్రచారం చేస్తోంది.
ఇంతకీ ఈ పేరు ఎలా బయటకొచ్చిందంటే.. పూణెలోని ఓ మెట్రో స్టేషన్ లో షూటింగ్ చేయడానికి అనుమతి కోసం యూనిట్ లెటర్ రాసింది. అందులో తమ సినిమా పేరును లయన్ గా పేర్కొంది. అలా షారూక్-అట్లీ సినిమాకు లయన్ అనే పేరు పెట్టినట్టు బయటకొచ్చింది.
ఈ సినిమాతో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అటు మరో హీరోయిన్ ప్రియమణి, చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ తర్వాత షారూక్ సరసన మరోసారి నటిస్తోంది.
లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా స్టార్ట్ చేసిన షారూక్, తన కొత్త ప్రాజెక్టు గురించి ఎలాంటి డీటెయిల్స్ బయటపెట్టడం లేదు. వీలైనంత వరకు అంచనాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు.