లేద‌న్న బీసీసీఐ, త‌ప్పుకున్న కొహ్లీ!

టీమిండియా క్రికెట్ జ‌ట్టు ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కొహ్లీ త‌ప్పుకోనున్నాడ‌ని ముందుగా వార్త‌లు వ‌చ్చాయి. బీసీసీఐ ఇన్ సైడ్ వ‌ర్గాలే ఈ స‌మాచారాన్ని ఇచ్చాయి. అయితే ఆ వెంట‌నే బీసీసీఐ స్పందించింది.…

టీమిండియా క్రికెట్ జ‌ట్టు ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కొహ్లీ త‌ప్పుకోనున్నాడ‌ని ముందుగా వార్త‌లు వ‌చ్చాయి. బీసీసీఐ ఇన్ సైడ్ వ‌ర్గాలే ఈ స‌మాచారాన్ని ఇచ్చాయి. అయితే ఆ వెంట‌నే బీసీసీఐ స్పందించింది. అధికారికంగా కాక‌పోయినా బీసీసీఐలోని కీల‌క వ్య‌క్తి స్పందించారు. కొహ్లీ త‌ప్పుకుంటున్నాడ‌నేది కేవ‌లం ఊహేనంటూ అందులో వాస్త‌వం లేదంటూ స్పందించారు. 

అయితే ఆయ‌న‌కు కూడా ఝ‌ల‌క్ ఇస్తున్న‌ట్టుగా టీ20 కెప్టెన్సీ నుంచి త‌ను త‌ప్పుకుంటున్న‌ట్టుగా విరాట్ కొహ్లీ అధికారికంగా ప్ర‌క‌టించేశాడు. దీంతో మొద‌ట వ‌చ్చిన ఊహాగానాలే నిజం అయిన‌ట్టుగా అయ్యింది. అయితే కొహ్లీ త‌ప్పుకుంటానంటున్న‌ది కేవ‌లం టీ20 కెప్టెన్సీ నుంచి మాత్ర‌మే. అది కూడా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పూర్త‌యిన త‌ర్వాత‌. ఈ విష‌యంలో బీసీసీఐ కూడా అభ్యంత‌రం చెప్ప‌క‌పోవ‌చ్చు.

అయితే..  కేవ‌లం కొహ్లీ కోరిన మేర‌కే అత‌డిని త‌ప్పిస్తారా లేక వ‌న్డే కెప్టెన్సీ నుంచి కూడా కొహ్లీని త‌ప్పిస్తారా? అనేది ఇప్పుడు అస‌లైన చ‌ర్చ‌. ప‌ని భారాన్ని త‌గ్గించుకోవ‌డానికే టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న‌ట్టుగా కొహ్లీ అంటున్నాడు. అయితే గ‌త రెండేళ్ల‌లో టీమిండియా ఆడిన టీ20 ల సంఖ్య మ‌రీ గొప్ప‌గా ఏమీ లేదు. వేళ్ల మీద లెక్క‌బెట్ట త‌గ‌న‌న్ని టీ20 మ్యాచ్ ల‌నే టీమిండియా ఆడింది. వాటిల్లో కూడా కొహ్లీ కెప్టెన్సీలో కాకుండా మ‌రొక‌రి కెప్టెన్సీ ఆడిన‌వి కొన్ని ఉండ‌నే ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో.. ప‌నిభారం అనేది అస‌లు విష‌యం కాద‌ని స్ప‌ష్టం అవుతోంది.

కొహ్లీ ఏమీ టీ20ల నుంచి రిటైర్డ్ కాలేదు. కేవ‌లం కెప్టెన్సీ నుంచి మాత్ర‌మే త‌ప్పుకున్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి కొహ్లీ త‌ప్పుకుంటే రోహిత్ కు ఆ బాధ్య‌త‌ల‌ను బీసీసీఐ అప్ప‌గించ‌వ‌చ్చు. అయితే అది అంత‌టితో ఆగుతుందా?  కేవ‌లం కొహ్లీ వ‌దిలిన బాధ్య‌త‌ల‌ను మాత్ర‌మే తీసుకోవ‌డానికి రోహిత్ స‌మ్మ‌తిస్తాడా? అనేది ప్ర‌శ్నార్థ‌కం. ఒక‌వేళ పూర్తిగా ప‌రిమిత ఓవ‌ర్ల మ్యాచ్ ల కెప్టెన్సీని రోహిత్ కాంక్షించ‌వ‌చ్చు. అప్పుడు బీసీసీఐ కొహ్లీని వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికి అయితే బంతిని బోర్డు కోర్టులోకే నెట్టేశాడు విరాట్ కొహ్లీ.