తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి దెబ్బకు అనంతపురం జిల్లా టీడీపీ నేతలే కాదు, రాష్ట్ర నేతలు కూడా వణికిపోతున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే జేసీ బ్రదర్స్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు వుంది.
స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా …మనసులో మాటను బయట పెట్టడం వారి నైజం. ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులం, మతం, వ్యక్తిత్వంపై జేసీ బ్రదర్స్ అవాకులు చెవాకులు పేలుతుంతే… చంద్రబాబు మొదలుకుని, ఇతర టీడీపీ నేతలు తెగ ఎంజాయ్ చేశారు.
ఇప్పుడు తమ వరకూ వచ్చే సరికి ఆ బాధ ఏంటో టీడీపీ నేతలకు తెలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ దక్కించుకున్న ఏకైక మున్సిపాలిటీగా తాడిపత్రి నిలిచింది. ఇది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘనతగా పార్టీ అంగీకరించక తప్పలేదు.
ఎందుకంటే స్వయాన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. అలాంటిది పట్టు నిలుపుకున్న జేసీ బ్రదర్స్ ఏం మాట్లాడినా టీడీపీ నేతలు పడాల్సిన పరిస్థితి.
ఇటీవల అనంతపురంలో రాయలసీమ స్థాయి పార్టీ నేతల సమావేశంలో కార్యకర్తలను పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు.
సమావేశం నుంచి బయటికొచ్చి కాలవ శ్రీనివాసులుపై నేరుగా, మరికొందరిపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనంతపురం జిల్లా టీడీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీకి ఎంతో బలమైన జిల్లాగా పేరున్న అనంతపురంలో టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ హెచ్చరిక ప్రకటన విడుదల చేయడం చర్చకు దారి తీసింది. ఇది అనంతపురం ఘటనల నేపథ్యంలో విడుదలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ నేతలు ఎవరైనా గీత దాటి వ్యవహరిస్తే వారిపై క్రమశిక్షణ చర్య తప్పదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టీడీపీ నియమావళికి విరుద్ధంగా పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలు చేసినా, ప్రసార మాధ్యమాలతో మాట్లాడినా లేక సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించడం గమనార్హం.
నిజంగా టీడీపీకి, అచ్చెన్నాయుడికి దమ్ము, ధైర్యం వుంటే పార్టీ నియమావళిని ధిక్కరించి కాలవ శ్రీనివాసులతో పాటు ప్రభాకర్‌చౌదరి, పల్లె రఘునాథరెడ్డిలపై వివిధ మాధ్యమాల వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా , కనీసం నేరుగా హెచ్చరించలేని నిస్సహాయ స్థితిలో టీడీపీ ఉందా? అనే ప్రశ్నల్ని అచ్చెన్నాయుడి ప్రకటన తెలియజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పార్టీ నియమావళిని అతిక్రమించినప్పుడు చర్యలు తీసుకోకపోవడంతో పాటు కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వలేని భయం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదంటున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అంటే చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు ఎంతగా భయపడుతున్నారో …తాజా ప్రకటన కంటే నిదర్శనం ఏం కావాలనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.