పోలీసులే రాకుంటే…కాల‌వ శ్రీ‌నివాసుల ప‌రిస్థితి?

పోలీసులు రావ‌డం కాసేపు ఆల‌స్యం అయి వుంటే అనంత‌పురం పార్ల‌మెంట‌రీ టీడీపీ అధ్య‌క్షుడు కాల‌వ శ్రీ‌నివాసుల ప‌రిస్థితి ఏమ‌య్యేదో అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌త్య‌ర్థులంటే కాల‌వ శ్రీ‌నివాసులు ఎటూ లెక్క లేకుండా మాట్లాడ్తార‌నే పేరుంది. …

పోలీసులు రావ‌డం కాసేపు ఆల‌స్యం అయి వుంటే అనంత‌పురం పార్ల‌మెంట‌రీ టీడీపీ అధ్య‌క్షుడు కాల‌వ శ్రీ‌నివాసుల ప‌రిస్థితి ఏమ‌య్యేదో అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌త్య‌ర్థులంటే కాల‌వ శ్రీ‌నివాసులు ఎటూ లెక్క లేకుండా మాట్లాడ్తార‌నే పేరుంది. 

ఇప్పుడు త‌న నైజాన్ని సొంత పార్టీ శ్రేణుల‌పై కూడా ప్ర‌ద‌ర్శించ‌డంతో క‌థ అడ్డం తిరిగింది. కాల‌వ శ్రీ‌నివాసులు త‌మ‌ను లెక్క లేకుండా మాట్లాడ్డంతో ఎస్సీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌పై దాడికి కుర్చీలు, చేతికి ఏది చిక్కితే అది అందుకున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

బుధవారం రాత్రి 40 మందితో కూడిన అనంతపురం టీడీపీ పార్లమెంటరీ కమిటీని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. కాల‌వ శ్రీ‌నివాసులు అధ్య‌క్షుడిగా, మ‌రో 40 మందితో కూడిన క‌మిటీని బుధ‌వారం రాత్రి టీడీపీ అధిష్టానం ప్ర‌క‌టించింది. శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల నుంచి బండారు శ్రావణిశ్రీని త‌ప్పించ‌డం వివాదానికి దారి తీసింది. ఆ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కమిటీల నియామకం, పార్టీ కార్యక్రమాల అమలు బాధ్యతలను ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలకు అధిష్టానం అప్పగించింది.

తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు కాలవను కలసి చర్చిద్దామని పార్టీ కార్యాలయానికి బండారు శ్రావణిశ్రీ అనుచ‌రులు, ఎస్సీ కార్య‌క‌ర్త‌లు వెళ్లారు. కాలవతో త‌మ‌ గోడు వెళ్లబోసుకుందామ‌ని ప్ర‌య‌త్నించ‌గా, అటు వైపు నుంచి రివ‌ర్స్ అటాక్ ఎదురైంది. కార్యకర్తలపై కాలవ శివాలెత్తారు.

‘మీ నియోజకవర్గంలో 41 వేల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ గెలిచింది. ఏంటి మీ గొప్ప.. పార్టీలో మీరెంత. మీరా పార్టీకి పని చేసింది. మీరా నాతో మాట్లాడేది. చెప్పినట్టు విని ఉంటే సరేసరి. లేదంటే చర్యలు తప్పవు. కార్యకర్తల సలహాలు తీసుకునే దుస్థితిలో ఇక్కడెవరూ లేరు. ఖబడ్దార్‌. నోరు అదుపులో పెట్టుకోండి. పార్టీ వీడుతామని బెదిరిస్తే భయపడాలా? చాలా మందినే చూశాం. పార్టీలో విర్రవీగిన వాళ్లంతా కనిపించకుండా పోయారు. మీరెంత’అంటూ ఆగ్రహావేశాల‌తో ఊగిపోయారు.

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన శింగనమలలో అగ్రకులాలకు పెద్దపీట వేస్తే తామేం కావాల‌ని అడ‌గ‌డ‌మే వాళ్ల నేర‌మైంది. త‌మ అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డంతో పాటు అవ‌మానించేలా మాట్లాడిన కాల‌వ‌పై వారు తీవ్ర‌స్థాయిలో తిర‌గ బ‌డ్డారు. కాల‌వ శ్రీ‌నివాసులును కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. ఎదురు దాడికి దిగాను. కొంద‌రు కుర్చీలతో కాలవపై దాడి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రికొంద‌రు ఇత‌ర వ‌స్తువుల కోసం వెతక‌డం క‌నిపించింది.

ప‌రిస్థితి అదుపు త‌ప్పుతుండ‌డంతో పోలీసులు ప్ర‌వేశించారు. కార్య‌క‌ర్త‌లుకు స‌ర్ది చెప్పి అక్క‌డి నుంచి పంపించారు.  మొత్తానికి టీడీపీ కార్యాలయంలో ఒక భ‌యాన‌క ప‌రిస్థితి క‌నిపించింది. ఇటీవ‌ల అనంత‌పురం జిల్లా టీడీపీలో రోజుకో వివాదం …  ఆ పార్టీని బ‌జారుకీడుస్తోంది. ఈ ధోర‌ణి టీడీపీ అధిష్టానాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది.