ఇన్నాళ్లూ ఉపేక్షించాం. ఓపికపట్టాం. ఇక సహించం. మా సత్తా ఏంటో చూపిస్తాం…
ఏపీ రాజకీయాల్లో అందరికీ ఇదొక కామెడీ అయిపోయింది. అర్హత కూడా మరిచి హెచ్చరికలు జారీ చేయడం కామన్ అయిపోయింది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. 23 మంది ఎమ్మెల్యేలున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శ చేస్తే దానికొక అర్థం ఉంటుంది. ఒకేఒక్క ఎమ్మెల్యే కలిగిన పవన్ కల్యాణ్ కూడా విమర్శలు చేయడం విడ్డూరంగా మారింది. ఇదే ఎక్స్ ట్రా అనుకుంటే, దీనికి ఇంకాస్త ఎక్స్ ట్రా జబర్దస్త్ యాడ్ చేస్తున్నారు లోకేష్.
అవును.. ఇప్పుడు చినబాబుకు కూడా కోపం వచ్చేసింది. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ ఇప్పుడు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇస్తున్నారు. ఏం చేస్తాం, ఏపీ రాజకీయాలు అలా తయారయ్యాయి మరి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, దిగ్విజయంగా వందరోజుల పాలన పూర్తిచేసుకున్న వేళ.. తప్పదన్నట్టు లోకేష్ కూడా సీఎంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ వందరోజులు సహించారట, ఇక సహించేది లేదని తన సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ విసురుతున్నారు లోకేష్.
అసలు లోకేష్ కు సవాల్ చేసే అర్హత ఉందా? సొంత పార్టీ నేతలే అతడ్ని చూసీచూడనట్టు పక్కనపెడుతున్నారు. తప్పదన్నట్టు ఓ నమస్కారం పడేసి తమదారిన తాము పోతున్నారు. చంద్రబాబు తనయుడు అనే హోదా తప్ప చెప్పుకోవడానికి మరే అర్హత లేని లోకేష్ కూడా జగన్ సర్కార్ పై సవాల్ విసరడం కామెడీ కాక మరేంటి? పోనీ లోకేష్ సవాల్ విసిరారనే అనుకుందాం. ప్రభుత్వానికి బహిరంగంగా హెచ్చరిక చేశారనే అనుకుందాం. అయితే ఏంటి?
ప్రభుత్వాన్ని గడగడలాడించే సత్తా లోకేష్ కు ఉందా? అసలు చినబాబు కార్యాచరణ ఏమిటి? అది కూడా కాస్త శెలవిస్తే విని తరిస్తారు ఏపీ ప్రజలు. అసలు కార్యాచరణ అనే పదం వినిపిస్తేనే ఆమడ దూరం పారిపోయే రకం లోకేష్. అలాంటి వ్యక్తి నుంచి యాక్షన్ ప్లాన్ ఆశించడం అవివేకం అవుతుంది. అందుకే జగన్ ప్రభుత్వంపై చినబాబు కామెంట్స్ చేస్తుంటే.. టీడీపీ నేతలు సైతం తెరచాటుకు వెళ్లి ముసిముసిగా నవ్వుకుంటున్నారు.
ఇంతకీ లోకేష్ మేకపోతు గాంభీర్యం అంతా ఎక్కడో తెలుసా? కేవలం కార్యకర్తల ముందు మాత్రమే. మీడియా ముందుకొచ్చి ఈ 3 ముక్కలు చెప్పే ధైర్యం అతడికి ఎప్పుడొస్తుందో ఏంటో? తమ రాజకీయాల కోసం గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస కేంద్రం అంటూ ఒక క్యాంప్ స్టార్ట్ చేసింది టీడీపీ. ఆ వేదికపై లోకేష్ ఇలా కామెడీ పండించారు. ఆ తర్వాత చూస్తే, అక్కడ లోకేష్ లేరు, పునరావాస కేంద్రం కూడా లేదు.