ముఖ్యమంత్రి పాలనపై స్పందిస్తా, నా రిపోర్ట్ ఇస్తా, అప్పుడు చెప్తా నా సంగతి అంటూ చెప్పుకొస్తున్న పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఈనెల 14న స్పందిస్తానంటూ తాజాగా ప్రకటించారు. పవన్ స్పందన ఏంటో ఈపాటికే జనాలకు అర్థమైంది. అనవసరమైన విషయాలకు రాద్ధాంతం చేస్తూ.. పేకాట రాయుళ్లను కాపాడేందుకు గొడవ చేసిన ఎమ్మెల్యేని కాపాడుకోవాలని చూస్తూ.. జనసేనాని ఇప్పటికే జనంలో పలుచన అయ్యారు.
ఆర్టీసీ విలీనంపై స్పందించరు, అమ్మఒడి గురించి మాట్లాడరు, ఉద్యోగాల కల్పనపై నోరు మెదపరు.. ఇన్ని మంచి పనులపై స్పందించని పవన్ కల్యాణ్ కేవలం రాజధాని విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అందరికీ తెలుసు. కేవలం టీడీపీకి కొమ్ముకాయడం కోసమే జనంలోకి వస్తున్న పవన్, తన లాలూచీ వ్యవహారాన్ని తానే బైటపెట్టుకుంటున్నారు. జగన్ పాలనపై 100రోజుల తర్వాత స్పందిస్తానన్న పవన్ కల్యాణ్ మహూర్త బలం కోసం వేచిచూస్తున్నారో ఏమో.. ఆ డేట్ ని కాస్త పొడిగించారు.
జగన్ 100రోజుల పాలనపై కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక రెండు మూడురోజుల్లో వస్తుందని, ఈనెల 14న శుభ మహూర్తాన జగన్ సర్కారుపై స్పందిస్తానంటూ తాజాగా ప్రకటించారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం రాజధాని రాద్ధాంతంపైనే పవన్ తన దృష్టిపెట్టారు. చంద్రబాబు లాగా అరిగిపోయిన రికార్డ్ ప్లే చేస్తున్న పవన్ కల్యాణ్ ఈమధ్య చెప్పిందే చెబుతూ జనసైనికులకు కూడా విసుగు తెప్పిస్తున్నారు.
పవన్ ఏ గట్టునుంటారో తేలిపోయిన తర్వాత ఆయన జగన్ సర్కారుపై ఏమని స్పందిస్తారో కూడా అందరికీ తెలుసు. 100రోజులైనా, 108రోజులైనా పవన్ స్పందన ఒక్కటే. జగన్ పై ఆయనకున్న అక్కసు వెళ్లగక్కడమే. ఇక మిగిలింది లాంఛనం మాత్రమే.