రాజకీయ నాయకులు, వివాదాలు జంట కవుల టైపు. అత్యధికమంది నాయకులు వివాదాల్లో ఉంటారు. వివాదాలు సృష్టిస్తారు. కొన్ని విషయాలు తెలియక వివాదమైతే, కొన్ని పనులు ఉద్దేశపూర్వకంగానే చేసి వివాదాలకు కారకులవుతారు. నరసింహస్వామి పుణ్యక్షేత్రం యాదాద్రిలో కేసీఆర్, కారు, కేసీఆర్ కిట్, హరితహారం వగైరా చిత్రాలు రాతిస్తంభాలపై చెక్కిన తీరు రాష్ట్రంలో రచ్చకు దారితీసింది. దీని ప్రభావం జనంపై ఎంతమేరకు పడుతుందో, ప్రతిపక్షాలు, ప్రధానంగా బీజేపీ, కాంగ్రెసు ఎంతమేరకు రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటాయో చూడాలి. ఒకటి మాత్రం వాస్తవం. కేసీఆర్ సహా ఆయన పార్టీకి, పాలనకు సంబంధించిన బొమ్మలన్నీ ఉద్దేశపూర్వకంగానే రాతి స్తంభాలపై చెక్కారు. కేసీఆర్‌ను దేవుడిగా, రాజుగా భావించిన శిల్పులే తమ అభిప్రాయాల ప్రకారం బొమ్మలు చెక్కారని యాదాద్రికి సంబంధించిన అధికారుల వివరణ.
యాదాద్రిలో ప్రతీ పని ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఆదేశాలు లేకుండా శిల్పులు బొమ్మలు చెక్కే అవకాశమే లేదని మరోవాదన. వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి, స్థపతి వేలు మీడియా సమావేశం పెట్టి ఇచ్చుకున్న వివరణ సందేహాలు తీర్చకపోగా మరిన్ని సందేహాలకు తావిచ్చింది. కేసీఆర్ ఈమధ్యనే యాదాద్రికి వెళ్లి ఒకరోజల్లా అక్కడే గడిపి ఆలయ నిర్మాణ పనులను అడుగడుగునా పరిశీలించారు. పనుల్లో జాప్యం జరుగుతోందని ఆగ్రహించి, సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు బారెడు క్లాసు పీకారు. ఆయన ఆలయంలో అణువణువు తిరిగి పరిశీలించినప్పుడు తనకు సంబంధించిన బొమ్మలు చెక్కిన రాతి స్తంభాలు కనిపించలేదా? సమీక్షా సమావేశంలో అధికారులు, ప్రధాన శిల్పులు ఫలాన పనులు చేస్తున్నామని చెప్పలేదా? ఒక ప్రాజెక్టు లేదా నిర్మాణం ప్రారంభించడానికి ముందే ఫలానవిధంగా చేయాలని ప్లాన్ ఉంటుంది.
యాదాద్రి పనులపై కేసీఆర్ సుదీర్ఘంగా కసరత్తు చేశాకే, ఆయన గురువు చినజీయర్ స్వామితో చర్చలు జరిపాకే ప్లాన్ సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. మరి అప్పుడు కేసీఆర్ పరిపాలనను భావి తరాలకు అందించడానికి రాతి స్తంభాలపై బొమ్మలు చెక్కాలని ఆలోచన చేశారా? లేదా? శిల్పులు కేసీఆర్‌ను రాజుగా, దేవుడిగా భావించి బొమ్మలు చెక్కడమేమిటో అర్థంకాని వివరణ. వారు రాజుగా, దేవుడిగా భావిస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయం అయివుడొచ్చు. దాని ప్రకారం వారు ఇష్టం వచ్చినట్లు బొమ్మలు చెక్కవచ్చా? శిల్పులు, ఆర్ట్ డైరెక్టర్ మొదలైనవారంతా జీతాలు తీసుకుంటూ పనిచేస్తున్నారు. యాదాద్రి పనులు పూర్తికాగానే వారు ఇంకెక్కడైనా మరో ప్రాజెక్టులో చేరతారు. ఇలాంటివారు అధికారుల పర్యవేక్షణలోనే పనులు చేయాలిగాని వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం ఎలా చేస్తారో తెలియడంలేదు. ఆలయాల ద్వారా భావితరాలకు చరిత్ర చెప్పడమేమిటో అర్థం కాదు.
చరిత్ర అంటే కేసీఆర్ పార్టీ, ఆయన ప్రభుత్వ పథకాలు కాదు కదా. సాంకేతిక విజ్ఞానం ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఈ కాలంలో, అనేక మాధ్యమాల ద్వారా సమాచారం కుప్పలుతెప్పలుగా అందుబాటులో ఉన్న ఈ యుగంలో ఆలయాల ద్వారా భావితరాలకు చరిత్ర చెప్పాలనుకోవడం ఏమిటి? తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఉందని, ఇంకో గుళ్లో ఇంకేవో ఉన్నాయని 'కతలు' వినిపించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆయనే పెట్టించుకున్నాడో, మరెవరైనా పెట్టారో ఆధారాలున్నాయా? వందల ఏళ్ల కిందట అనేకమంది రాజులు గొప్ప ఆలయాలు నిర్మించారు. కాని వారి పరిపాలన గురించి గొప్పలు చెప్పుకునే విధంగా బొమ్మలు చెక్కించుకున్న దాఖలాలు లేవు. ఒక విషయం చెప్పుకోవచ్చు.
వందల ఏళ్ల క్రితం సమాచార సాధానాలు, ఇప్పటిలా సాంకేతికత లేవు. అందుకని శాసనాలు వేయించేవారు. చాలా ఆలయాల్లో ఇవి కనబడతాయి. లైంగిక విజ్ఞానాన్ని తెలియచేయడం కోసం అందుకు సంబంధించిన బొమ్మలు కొన్ని ఆలయాల్లో ఉన్నాయి. అప్పట్లో ప్రజలు ఎక్కువగా వెళ్లేది లేదా గుమికూడేది ఆలయాల్లోనే. అందుకే ఆలయాలను ప్రచార సాధానాలుగా కొంతమేరకు ఉపయోగించుకున్నారు. అలా ఆలయాల ద్వారా భావితరాలకు కొన్ని విషయాలు చెప్పివుండొచ్చు. కాని ఈ కాలంలో ఆ అవసరం లేదు.
కేసీఆర్ తన పాలనా వైభవాన్ని గురించి భావితరాలకు తెలియచేయాలంటే రాజప్రాసాదాన్ని తలపించే తెలంగాణ భవన్‌లో మ్యూజియం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆలయాల్లో ఆగమశాస్త్రాల విషయంలో చిన్న వివాదాలు తలెత్తితేనే చర్చలు జరిపే స్వామీజీలు యాదాద్రిలో బొమ్మలు తప్పంటారా? ఒప్పంటారా? ముఖ్యంగా యాదాద్రితో ప్రత్యక్ష సంబంధాలున్న కేసీఆర్ గురువు చినజీయర్ స్వామి, రెండు రూపాయలకు రెండెకరాల ప్రభుత్వ భూమిని పొందిన మరో గురువు స్వరూపానందేంద్ర స్వామి రంగంలోకి వచ్చి మాట్లాడాలి. కాని వారు తెరముందుకు వస్తారా? డౌటే..!