అవసరార్థం బీజేపీలో చేరిన మాజీ తెలుగుదేశం పార్టీ నేతలు తిరిగి అదే పార్టీ బాట పట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశాలు కూడా అయ్యారు రహస్యంగా! పూర్వ అనంతపురం జిల్లాలో భాగమైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇప్పటికే పలుమార్లు చంద్రబాబుతో సమావేశం అయినట్టుగా టాక్.
గత ఎన్నికల్లో ఓడిన వెంటనే సూరి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. కాంట్రాక్టర్ అయిన సూరి బిల్లుల వ్యవహారాలను క్లియర్ చేసుకునేందుకు కమలం పార్టీలో చేరారనే అభిప్రాయాలున్నాయి. ఇంకో ఏడాదిన్నరలోనే ఎన్నికలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన టికెట్ చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారట! దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నట్టు భోగట్టా.
ఇక ఆయనే కాదు.. అప్పట్లో భారతీయ జనతా పార్టీలో చేరిన మరో నేత కూడా ఈ ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. ఆయనే సుజనా చౌదరి. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోగానే కమలం పార్టీ కండువా వేసుకున్న వారిలో సుజనా ముఖ్యులు. రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిపోయారు. అయితే ఆయనపై అనర్హత వేటు కోసం తెలుగుదేశం పార్టీ కనీసం రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు కూడా చేయలేదు. బీజేపీలో తనవారు కొందరు ఉండటాన్ని చంద్రబాబు కోరుకోవడంతోనే ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ కిక్కురుమనలేదనేది సర్వత్రా ఉన్న అభిప్రాయమే!
ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సుజనా చౌదరి బ్యాక్ టు టీడీపీ ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. దీనిపై ఆయన చినబాబు లోకేష్ వద్దకు మధ్యవర్తులను కూడా పంపినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యవర్తులతో భారీ ఆఫర్లు కూడా పంపిస్తున్నారట సుజన. కేవలం చేరికకే అయితే ఇబ్బంది లేదు. కానీ సుజనా చౌదరి వద్ద ఒక కోరిక కూడా ఉందని తెలుస్తోంది అదే విజయవాడ ఎంపీ టికెట్.
విజయవాడ ఎంపీ టికెట్ ను తనకు కేటాయించాలని సుజనా చౌదరి కోరుతున్నట్టుగా సమాచారం. మరి తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ టికెట్ కు ఉండే పోటీ అంతా ఇంతా కాదు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా చిత్తైనా విజయవాడ ఎంపీ సీటును టీడీపీ నెగ్గింది. ఇది కంచుకోటగా నిలిచింది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే సారి ఈ టికెట్ ను దక్కించుకోవడానికి చాలా మంది పోటీపడవచ్చు.
ఈ పోటీని దృష్టిలో ఉంచుకునే సుజనా చౌదరి భారీ ఆఫర్ కూడా ఇస్తున్నారట. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఖర్చును మొత్తం భరించడానికి కూడా చౌదరి సుముఖంగా ఉన్నట్టుగా మధ్యవర్తులతో కబురు అందుతోందట చినబాబుకు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఖర్చును భరించడానికి ఆయన రెడీగా ఉన్నారని, ప్రతిగా విజయవాడ ఎంపీ టికెట్ కేటాయించాలనేది విన్నపమట! మరి ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కమలం పార్టీ నేతలకు కూడా తెలిసినట్టుగా సమాచారం. అవసరం కోసం తమ వద్దకు చేరి, ఇప్పుడు అవసరం తీరిపోగానే వెళ్లిపోతున్నారా.. అంటూ కారాలూ మిరియాలూ నూరుతున్నారు!