ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల కూడా మెచ్చుకునేలా చంద్రబాబు మాట్లాడ్డారు. ఇదే ఆయన నుంచి రాయలసీమ సమాజం కోరుకుంటున్నది. ఒక్క జగన్పై కోపంతో మొత్తం రాయలసీమ సమాజాన్ని ఇంత వరకూ బాబు, ఆయన తనయుడు లోకేశ్ కించపరుస్తూ వచ్చారు. దీనివల్ల రాజకీయంగా నష్టం జరుగుతోందనే ఫిర్యాదులు వారి దృష్టికి వెళ్లాయి. దీంతో పులివెందుల, కడప, రాయలసీమపై చంద్రబాబు ఆచితూచి మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఇటీవల కాలంలో ఇంత పద్ధతిగా మాట్లాడ్డం ఇదే కావచ్చు. ఉండవల్లిలో తన నివాసంలో పులివెందులతో పాటు పలు నియోజకవర్గాల టీడీపీ బాధ్యులతో ఆయన సమావేశమయ్యారు. పులివెందులపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగన్ విద్వేష పాలనపై జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా వ్యతిరేకత వుందన్నారు.
ముఖ్యంగా వివేకా హత్యపై సమాధానం చెప్పలేక జగన్ నైతికంగా పతనమయ్యారని ఆరోపించారు. వివేకా హత్య విచారణపై ప్రభుత్వం, అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు వల్ల పులివెందులకూ చెడ్డపేరు తీసుకొస్తున్నారని బాబు విమర్శించారు. ఈ కేసులో దోషులను స్వయంగా జగనే కాపాడటం పులివెందుల వాసులకు మింగుడు పడటం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు విమర్శల్లో ప్రతి అక్షరం విలువైందే.
ఎందుకంటే పులివెందుల మనసును ప్రతిబింబించేలా చంద్రబాబు చాలా పద్ధతిగా విమర్శించారు. ఇది విమర్శో, ఆరోపణో అనుకోవడం కంటే వాస్తవాల్ని కళ్లకు కట్టారు. వివేకా హత్య విషయంలో జగన్ వైఖరిని ఒక్క పులివెందులే కాదు, కడప జిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోతోందన్నది పచ్చి నిజం.
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వైఎస్ వివేకాను అభిమానిస్తారు. అలాంటి నాయకుడిని అత్యంత దారుణంగా చంపడం, వారిని జగన్ కాపాడుతున్నారనే భావన ప్రజానీకానికి మింగుడు పడటం లేదు. ఇదే మాటను బాబు చాలా పద్ధతిగా చెప్పారు. పులివెందులను విమర్శించకుండా, జగన్ వల్ల ఆ ప్రాంతానికి చెడ్డ పేరు వస్తోందనడం గమనార్హం.