జగన్ సర్కార్ పిచ్చికి లెక్క లేకుండా పోతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై కొంత కాలం వివాదం నడిచింది. ఆ తర్వాత న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో సర్దుకుంది. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చి, వైఎస్సార్ పేరు పెట్టడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. చివరికి సొంత పార్టీ వాళ్లు కూడా అంతర్గతంగా వ్యతిరేకించిన పరిస్థితి.
తాజాగా సీఎం సొంత జిల్లాలోని యోగివేమన యూనివర్సిటీలో వైఎస్సార్ విగ్రహం వివాదానికి దారి తీసింది. తండ్రిపై జగన్‌కు ప్రేమ సంగతేమో గానీ, ప్రభుత్వ చర్యల వల్ల దివంగత నేతను కూడా తిట్టుకుంటున్న దుస్థితి ఏర్పడింది. కడపలో యోగివేమన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన భవనం వద్ద ఏర్పాటు చేసిన వేమన విగ్రహాన్ని తాజాగా మార్చివేశారు. ఈ ప్లేస్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై విద్యార్థులు, పౌర సమాజం మండిపడుతోంది.
గతంలో ఎస్వీయూ పరిధిలో పీజీ సెంటర్ వుండేది. దాన్ని యోగివేమన విశ్వవిద్యాలయంగా వైఎస్సార్ మార్చి, తగిన సౌకర్యాలు కల్పించారు. ఇది వైఎస్సార్‌కు మంచి పేరు తెచ్చింది. అయితే ఎవరి పేరు మీద విశ్వవిద్యాలయం ఉన్నదో, ఆయనకు సంబంధించి విగ్రహాన్ని మరో చోట పెట్టి, ఆ మహనీయుడి విగ్రహం స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. జగన్ సర్కార్‌కు ఇదేం పాడు బుద్ధి అని విద్యార్థులు విమర్శిస్తున్న పరిస్థితి.
కడపలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, తమకు ఉన్నత చదువులు అందించడానికి కారణమైన దివంగత వైఎస్సార్‌పై విద్యార్థుల్లో ఆరాధన భావం వుంది. వాళ్ల హృదయాల్లో వైఎస్సార్‌కు ప్రత్యేక స్థానం వుంది. అలాగని యోగివేమన విగ్రహం తొలగించి, వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టడాన్ని ఎలా సమర్థిస్తామని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
సీఎం జగన్ మెప్పు కోసం విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు వేమన లాంటి మహా యోగిని అవమానించడం తగదని విద్యార్థులు హితవు చెబుతున్నారు. తక్షణం యోగి వేమన విగ్రహాన్ని వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట పెట్టాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.