అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలొచ్చేసాయి. 2020 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నది తేటతెల్లమయ్యింది. రిపబ్లికన్ పార్టీకి గానీ, డెమోక్రటిక్ పార్టీకి గానీ అత్యధిక మెజారిటీ రాలేదు. నెక్ టు నెక్ గా ముగిసింది.
కానీ అత్యధికులు అనుకున్నది మాత్రం ఇది కాదు. ట్రంప్ వర్గం చేసిన మీడియా ప్రచారానికి డెమాక్రటిక్ పార్టీ దిక్కులేకుండా ఎగిరిపోతుందని చాలామంది భావించారు. కొందరైతే ప్రచారానికి ప్రభావితం చెంది అసలు డెమాక్రటిక్ పార్టీ మ్యాపులోనే ఉండదనుకున్నారు.
బైడన్ చేతకానితనం, చేస్తున్న తప్పులు అంటూ గత రెండేళ్లుగా మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి.
ట్రంప్ వర్గం తమ రెడ్ సిగ్నల్ ను ఎప్పటికప్పుడు డెమాక్రటిక్ పార్టీకి చూపిస్తూనే ఉన్నారు. చేతకాని ప్రభుత్వమన్నారు, చేవలేని పాలన అన్నారు, దేశం అడుక్కుతింటోందన్నారు, ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తోందన్నారు, స్టాక్ మార్కెట్ పతనమయ్యిందని గగ్గోలు పెట్టారు, హౌసింగ్ మార్కెట్ కుప్పకూలిందన్నారు, చైనా-తైవాన్ యుద్ధం విషయంలోనూ, రష్యా-ఉక్రైన్ పోరు అంశంలోనూ ప్రభుత్వం తెలివి తక్కువగా ప్రవర్తించిందన్నారు…తాము అధికారంలోకి వస్తే తప్ప అమెరికాకి మళ్లీ మంచిరోజులు రావన్నారు. ఇలా ఎన్ని చెప్పినా ఎంత చేసినా ప్రజలు మాత్రం డెమాక్రటిక్ పార్టీకే ఓట్లేసి గెలిపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే డెమాక్రటిక్ పార్టీ ఓటు బ్యాంక్ ఎటూ పోలేదు. రిపబ్లికన్ పార్టీకైతే ఉన్న ఓటు బ్యాంకే ఉంది తప్ప కొత్తగా వచ్చి చేరిందేమీ లేదన్నది ఒక అంచనా.
ఇది చూసి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల్ని కూడా అర్థం చేసుకోవాలి. 2009 ఎలక్షన్స్ లో రెండవ సారి వైఎస్సార్ కి రాజయోగం ఉండదని, కాంగ్రెస్ భూస్థాపితం ఖాయమని ఏళ్లతరబడి పచ్చమీడియా కథనాలు అల్లుతూనే వచ్చారు. కానీ చెంప ఛెళ్లుమనేలా వైఎస్సార్ మళ్లీ పదవిలోకొచ్చాడు.
2019 ఎన్నికల్లో రాష్ట్రానికి చంద్రబాబు తప్ప మరొక దిక్కు లేదని జగన్ మోహన్ రెడ్డి పనికిరాడని అన్నారు. కొందరైతే జగన్ సీయమ్మా అని నవ్వారు, ఎగతాళి చేసారు. కానీ అలా ప్రచారం చేసిన వారి గూబ గుయ్యి మనేలా ప్రజాతీర్పు వచ్చింది.
అయినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కళ్లులేని కబోది విలువిద్య ప్రదర్శనలాగ చీకట్లో బాణాలేసుకుంటూ కాలక్షేప యుద్ధం చేస్తోంది పచ్చ మీడియా. వైకాపాని తిట్టకుండా పూట గడవని పచ్చమీడియా, పచ్చ మీడియా చెప్పేదంతా అక్షరసత్యమని నమ్మే తెదేపా అధినేత కనీసం అమెరికా ఎన్నికల ఫలితాలు చూసైనా జ్ఞానోదయం పొందుతారా అంటే కష్టమే. ఎందుకంటే వాళ్ల ప్రపంచం పేరు “ఫూల్స్ పారడైజ్”. అక్కడ తెలివికి, సత్యానికి చోటు లేదు.
ఇంతమాట ఎందుకనాల్సి వస్తోందంటే ఏ నాయకుడైతే ప్రజల్లో ఉంటాడో వాడికే ఓట్లొస్తాయి. మీడియాని నమ్ముకుని ఇంట్లో కూర్చుంటే ఓటమి ఖాయం. ఈ విషయంలో పలు గతానుభావులున్నా కూడా అదే పంథాలో ఉండడాన్ని “ఫూల్స్ ప్యారడైజ్” అనక ఏమనాలి!
– హరగోపాల్ సూరపనేని