ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేయడంపై మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిరంజీవిని పకోడి అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నానిపై మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిపై కొడాలి నాని అమితమైన ప్రేమ ప్రదర్శించడం గమనార్హం. ఏంటబ్బా నానిలో ఇంత మార్పు అని సొంత పార్టీ వాళ్లు కూడా అనుకునే పరిస్థితి.
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా గుడివాడలో చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవిని విమర్శించేంత సంస్కార హీనుడిని కాదన్నారు. చిరంజీవిని తాను విమర్శించినట్టు నిరూపించాలని ఆయన సవాల్ విసరడం విశేషం. తాను శ్రీరామ అన్నా కూడా టీడీపీ, జనసేన నేతలకు బూతు మాటలుగా వినపడతాయన్నారు.
రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శిస్తే ఎంతటి వారినైనా తాను చీల్చి చెండాడుతానని ఆయన హెచ్చరించారు. ఎవరి జోలికి వెళ్లని పెద్దాయన చిరంజీవిని విమర్శించేంత సంస్కార హీనుడిని కాదని నాని తేల్చి చెప్పారు. చిరంజీవితో తమకు అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్ర పన్నుతున్నాయని ఆయన విమర్శించారు.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు గుడివాడలో తన కార్యాలయం మీదుగా వెళుతున్నప్పుడు నమస్కారం పెట్టిన విషయాన్ని కొడాలి గుర్తు చేశారు. పెద్దాయనగా చిరంజీవి చేసే సూచనల్ని పరిగణలోకి తీసుకుని పాటిస్తామన్నారు. తమకు సలహాలు ఇచ్చినట్టే.. ఇండస్ట్రీలో డ్యాన్సులు, నటన చేతగాని పకోడిగాళ్లకు కూడా ఇవ్వాలని కోరినట్టు నాని క్లారిటీ ఇచ్చారు.