మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మరోసారి తెలంగాణ రాజకీయాలపై స్పందించారు. తిరుమలలో శ్రీవారిని మరోసారి ఆయన మంగళవారం దర్శనం చేసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడం, అందులో తన పేరు ఉన్న నేపథ్యంలో మైనంపల్లి మరోసారి మీడియాతో మాట్లాడారు. నిన్నటి కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.
మెదక్‌లో తన కుమారుడు రోహిత్‌కు, మల్కాజ్‌గిరిలో తనకు కేటాయిస్తేనే బీఆర్ఎస్‌లో వుంటామని ఆయన తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. మెదక్‌లో మంత్రి హరీశ్‌రావు పెత్తనం ఏంటని ఆయన నిలదీశారు. అవసరమైతే ఈ దఫా కాకుండా మరోసారి వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో హరీశ్‌రావుపై పోటీ చేసి ఓడిస్తామని హెచ్చరించారు.
మైనంపల్లి విమర్శలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ స్థాపనలో హరీశ్‌రావు కీలక పాత్ర పోషించారని కేటీఆర్ మద్దతుగా నిలిచారు. అయితే తన కుమారుడు రోహిత్ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని మైనంపల్లి ఇవాళ స్పష్టం చేశారు.
జీవితంలో తాను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. తనను ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా బదులిస్తానని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వుంటానన్నారు. ఎవరినీ విమర్శించనన్నారు. తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇస్తే గెలిపించుకుని వస్తానని ఆయన అన్నారు.