తెలంగాణ రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా వ్యక్తిగత స్వార్థం తప్ప, సిద్ధాంతాలు, విలువలు ఏవీ లేవని నేతలు నిరూపిస్తున్నారు. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఈ దఫా సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించారు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తన భార్యకు టికెట్ రాకపోవడంతో వెంటనే ఆమె భర్త శ్యాంనాయక్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
తన భర్త ఆవేశంలో కాంగ్రెస్‌లో చేరినట్టు రేఖానాయక్‌తో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తానింకా 50 రోజుల పాటు ఎమ్మెల్యేనే అని చెప్పుకొచ్చారు. ఖానాపూర్ ప్రజలు తన వైపే ఉన్నారన్నారు. ఇదే సందర్భంలో ఆమె ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తన పీఏ ద్వారా గాంధీభవన్‌లో టికెట్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్న విషయమై చర్చ నడుస్తోంది.
మరోవైపు రేఖానాయక్ భర్త శ్యాంనాయక్ ఆసిఫాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్‌లో వుంటూనే కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంపై ఆ నియోజకవర్గ పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం టికెట్ కోసం కాంగ్రెస్‌లో చేరకుండానే దరఖాస్తు చేసుకునే నేతలను ఎలా నమ్మాలనే ప్రశ్న ఉత్పన్నమైంది. బీఆర్ఎస్ నిరాకరిస్తే కాంగ్రెస్‌లో చేరితే, అంత వరకూ ఆ పార్టీలో వుంటున్న వారి పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది.